పాఠశాల సెలవులను కూడా వివాదాస్త్రంగా మార్చిన బిజెపి

పాట్నా :   బిజెపి యేతర రాష్ట్రాల్లో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పాఠశాల సెలవులను కూడా అస్త్రంగా వినియోగిస్తోంది. విద్యార్థులకు ఇచ్చే సెలవులతో బీహార్‌లో వివాదానికి తెరతీసింది. ఇటీవల బిజెపితో తెగతెంపులు చేసుకున్న జనతాదళ్‌ (యునైటెడ్‌) అధ్యక్షుడు నితీష్‌కుమార్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి)తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దీంతో నితీష్‌కుమార్‌ను టార్గెట్‌ చేసేందుకు బిజెపి ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టడంలేదు.

రెండు రోజుల క్రింత బీహార్‌లోని విద్యాశాఖ 2024 పాఠశాలలకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ సెలవులపై వార్తాపత్రికలతో పాటు ఎలక్ట్రానిక్‌ మీడియాలో కూడా తప్పుడు కథనాలు ప్రచారమయ్యాయి. ఈ కథనాల సారాంశమేమిటంటే.. పాఠశాలలకు ప్రకటించిన సెలవుల్లో హిందూ పండుగలు రద్దు చేయబడ్డాయి. ముస్లిం సెలవులు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ తప్పుడు సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను ట్రోల్‌ చేయడం ప్రారంభించాయి.  పలువురు సీనియర్‌ బిజెపి నేతలు మరియు ప్రసంగవేత్తలు ఈ నకిలీ వార్తలకు విస్తృత ప్రచారం కల్పించారు. దీంతో టివి, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో ఈ అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి. చివరికి హిందూ వర్గం కూడా ఈ వార్తలపై ఆగ్రహం కలిగి ఉందంటూ సోషల్‌మీడియా హోరెత్తించింది.

అసలు విషయమేమిటంటే..

ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంటాయి. అయితే వేర్వేరు పాఠశాలల కోసం వేర్వేరు క్యాలెండర్‌లను జారీ చేస్తాయి. మదర్సా మరియు మక్తాబ్‌లకు వేర్వేరు సెలవుల జాబితా ఉంటుంది. మదర్సా మరియు మక్తాబ్‌ల సెలవుల జాబితాను మాత్రమే ఎంచుకుని.. అన్ని విద్యాసంస్థలకు ఈ సెలవులనే జారీ చేశారంటూ సోషల్‌మీడియా, వార్తాపత్రికలు నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేశాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వంలో కూడా ఉత్తరప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ మదర్సా ఎడ్యుకేషన్‌ ఆదివారానికి బదులుగా శుక్రవారాన్ని సెలవుదినంగా ప్రకటిస్తుంది. నితీష్‌కుమార్‌-తేజస్వీయాదవ్‌ల ప్రభుత్వం వేసవి సెలవులను 20 నుండి 30 రోజులకు పొడిగించింది. ఆ సమయంలో వచ్చే హిందూ పండుగలకు ప్రత్యేకంగా సెలవులను పేర్కొనలేదు.

దీంతో ఉద్దేశపూర్వకంగా విద్వేషపూరిత ప్రచారాన్ని వ్యాప్తి చేసేందుకు బిజెపి ఈ జాబితాను అస్త్రంగా వినియోగించింది. బీహార్‌లోని నితీష్‌కుమార్‌ ప్రభుత్వం ముస్లింలకు మాత్రమే ఐటి పార్క్‌, మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తోంది. అలాగే షాదీ షగున్‌ పథకం, వక్ఫ్‌ సంస్థలకు వడ్డీలేని రుణాలు, హజ్‌యాత్రకు సబ్సిడీ, మౌల్వీలకు జీతాలు, ముస్లిం విద్యార్థులకు ఉచిత యుపిఎస్‌ఇ కోచింగ్‌ ఇస్తోంది. ఇవి సంక్షేమం కాదు.. ఇవి యుద్ధం అని బిజెపి ట్వీట్‌ చేసింది. ఈ దేశంలో ‘ సెక్యులరిజం’ సమాధానపరిచే అంశంగా మారిపోయిందని ఆరోపించింది. జన్మాష్టమి, రక్షా బంధన్‌, శివరాత్రి పండుగలకు సెలవులు ఇవ్వకుండా ముస్లిం పండుగైన ఈద్‌కు ఒక్కరోజు బదులుగా మూడు రోజులు సెలవులను ప్రకటించిందని బిజెపి పేర్కొంది.

➡️