ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెడికి ఘోర పరాభవం

న్యూఢిల్లీ : ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజెడి ఘోర పరాభవం పాలైంది. రాష్ట్రంలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా బిజెపి 78 స్థానాల్లో విజయం సాధించింది. బిజెడి 51 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ 14 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు నాలుగు స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. దీంతో 2000 నుంచి ఒడిషాలో అధికారంలో ఉన్న బిజెడి ఈ దఫా తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంది. ఎన్‌డిఎలో భాగస్వామిగా లేకపోయినా పార్లమెంటులో పలు సందర్భాల్లో మోడీ సర్కార్‌కు పరోక్షంగా మద్దతు ఇవ్వడం, రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నా బిజెపి ప్రభుత్వంపై పెద్దగా పోరు సల్ఫకుండా బిజెడి అధినేత నవీన్‌ పట్నాయక్‌ వ్యవహరించారు. మోడీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా ఫోరంలోనూ ఆయన జట్టు కట్టలేదు. ఈ నేపథ్యంలో బిజెపి ఒడిషాపై దృష్టి కేంద్రీకరించింది. ఈ పరిణామాలకు ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడు అవ్వడంతో నవీన్‌ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

ఉప సమరంలో బిజెపికి 11 కాంగ్రెస్‌కు 6 స్థానాలు ..
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. లోకసభ ఎన్నికలతో పాటు ఈ స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరిగ్గా, మంగళవారం ఫలితాలను ప్రకటించారు. బిజెపి 11 స్థానాల్లోనూ, కాంగ్రెస్‌ 6 స్థానాల్లో విజయం సాధించాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగుస్థానాల్లో అధికార కాంగ్రెస్‌ విజయం సాధించింది. రెండిండిని బిజెపి సొంతం చేసుకుంది. సుజనపూర్‌ లాహౌల్‌-స్పిటి, గాగ్రెట్‌, కుత్లెహర్‌ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ గెలుపు సాధించగా, ధర్మశాల, బర్సార్‌ల్లో బిజెపి విజయం సాధించింది.
గుజరాత్‌్‌లో జరిగిన ఐదు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ బిజెపి విజయం సాధించింది. పోర్‌బందర్‌, మనవ డార్‌, ఖంభాత్‌, వఘోడియా, విజాపూర్‌ స్థానాలను బిజెపి దక్కించుకుంది. జార్ఖండ్‌ లోని గాండీ నియోజవర్గ ఉప ఎన్నికల్లో జెఎంఎం అభ్యర్థి, మాజీ ముఖ్య మంత్రి హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సొరెన్‌ విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్‌లోని భగబంగోల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టిఎంసి అభ్యర్థి రేయత్‌ హుస్సేన్‌ గెలుపు సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీ గణేష్‌ నారాయణ విజయం సాధించారు. రాజస్థాన్‌లోని బగిదొర నియోజకవర్గంలోని జరిగిన ఉప ఎన్నికల్లో భారత్‌ ఆదివాసీ పార్టీ (బిఎపి) అభ్యర్థి జైకృష్ణ పటేల్‌ విజయం సాధించారు. కర్ణాటకలోని షోరాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజా వేణుగోపాల్‌ నాయక్‌ విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ఈస్ట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. ఇదే రాష్ట్రంలోని దద్రౌల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్‌పి అభ్యర్థి విజయం సాధించారు. బీహార్‌లోని అగాన్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో సిపిఐ(ఎంఎల్‌) అభ్యర్థి శివ్‌ ప్రకాశ్‌ రంజన్‌ విజయం సాధించారు.

➡️