‘తొలి దశలోనే బిజెపి బోల్తా

Apr 21,2024 00:31 #Rahul Gandhi
  • ఆర్‌ఎల్‌డి నేత తేజస్వీ యాదవ్‌

పాట్నా : సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలో బిజెపి తొలి దశలోనే బోల్తా పడిందని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జెడి) నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి చేస్తున్న ‘అబ్‌ కీ బార్‌ 400 పార్‌’ (మరోసారి 400 పైగా) నినాదాన్ని ఆయన ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌పై శనివారం తేజస్వీ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. తొలి విడతలోనే బిజెపి ‘అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌’ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుందన్నారు. ‘తొలి విడతలో బీహార్‌లో జరిగిన నాలుగు సీట్లల్లో మహా ఘట్బంధన్‌ కూటమి ఘన విజయం సాధిస్తుంది. బ్లాక్‌ల వారిగా నిర్వహించిన సమావేశాల ద్వారా అభిప్రాయాలు, నివేదికలు సేకరించాం. అన్ని నివేదికలు సైతం కూటమికే విజయావకాశాలు ఉన్నట్లు తెలిపాయి. బిజెపి’400 పార్‌’ సినిమా మొదటి రోజే ఫ్లాప్‌ అయింది. బీహార్‌ ప్రజలు చైతన్యం కలవారు. ఈ సారి బిహార్‌ ప్రజలు బిజెపికి బుద్ధి చెబుతారు’ అని ఆయన అన్నారు.
తొలి విడత పోలింగ్‌లో అసలు బలమైన పోటీనే లేదని, బీహార్‌లో బిజెపికి దిమ్మతిరిగేలా ఫలితాలుంటాయని ఆయన చెప్పారు. ‘బీహార్‌ ప్రజలకు బిజెపి చేసిందేమీ లేదు. 2014, 2019లో ప్రధాన మోడీ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలయ్యాయి. ఆయనవన్నీ నకిలీ హామీలు, గ్యారంటీలు. వీటితో బీహార్‌ ప్రజలు విసిగిపోయారు’ అని తేజస్వీ పేర్కొన్నారు.
మహా ఘట్బంధన్‌, ఇండియా ఫోరం కలిసి పోటీ చేస్తున్నాయని, తమ రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని, అలాగే ద్రవ్యోల్భణం, పేదరికం, పెట్టుబడుల సమస్యలూ ఉన్నాయని చెప్పారు. ‘మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని బిజెపి నేతలంటున్నారు..అయితే రాజ్యాంగాన్ని ధ్వసం చేద్దాం అనుకునే వాళ్లే ధ్వంసమై పోతారు’ అని తేజస్వీ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో తొలి విడతలో 48.88 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. మొదటి దశలో జముయి, నవాడా, గయా, ఔరంగాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో పోలింగ్‌ జరిగింది.

➡️