కర్ణాటకలో 17 చోట్ల బిజెపి, 9 స్థానాల్లో కాంగ్రెస్‌

Jun 4,2024 23:51 #2024 election, #Karnataka BJP, #win

బెంగళూరు : 2019 ఎన్నికలతో పోల్చుకుంటే కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌ మెరుగుపడింది. కాంగ్రెస్‌ ఈసారి ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో 5 స్థానాలు కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందినవి. ఆస్తకికరంగా 2014లో కూడా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌ ఈ రాష్ట్రంలో తొమ్మిది స్థానాలు గెలుచుకుంది. మరోవైపు బిజెపికి ఈ సారి 17 స్థానాలు, జెడి(ఎస్‌)కు రెండు స్థానాలు లభించాయి. బీదర్‌, బళ్లారి, గుల్బర్గ, కొప్పల్‌, రాయిచూర్‌, దేవనగరి, హసన్‌, చామరజానగర్‌, చిక్కొడి స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. బగల్‌కోట్‌, బెంగుళూర సెంట్రల్‌, బెంగుళూరు సౌత్‌, బెంగుళూరు నార్త్‌, బెంగుళూరు రూరల్‌, బెల్గావి, విజయపుర, చిక్‌బళ్లాపూర్‌, చిత్రదుర్గు (ఎస్‌సి), దక్షిణ కన్నడ, ధర్వాడ్‌, హవేరి, మైసూర్‌, శివమెగ్గ, తుమకురు, ఉడిపి-చిక్‌మంగళూరు, ఉత్తర కన్నడ స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. జెడి(ఎస్‌) మాండ్యా, కోలార్‌ స్థానాలను దక్కించుకుంది. మొత్తం 28 స్థానాల్లో 2019లో కాంగ్రెస్‌కు కేవలం ఒక్కస్థానం మాత్రమే లభించింది. బిజెపి 25 స్థానాలను గెలుచుకుంది. అప్పుడు కాంగ్రెస్‌ కూటమిలో ఉన్న జెడి(ఎస్‌)కు ఒక్క స్థానం దక్కింది.
రాజధాని బెంగళూరులోని నాలుగు స్థానాలను బిజెపి దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలికిన ఓల్డ్‌ మైసూర్‌ ప్రాంతంలోనూ ఇప్పుడు బిజెపి, జెడి(ఎస్‌)లు సత్తా చాటాయి. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ సోదరుడు డికె సురేష్‌ బెంగుళూరు గ్రామీణ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందడం ఆశ్ఛర్యం కలి గిస్తోంది. ఇక్కడ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ప్రధాని దేవగౌడ అల్లుడు డాక్టర్‌ మంజునాథ్‌్‌ విజయం సాధించారు. ఈ సారి లోక్‌సభకు పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రులు ముగ్గు రూ విజయం సాధించడ విశేషం. కుమారస్వామి (జెడి(ఎస్‌)), బసవరాజ్‌ బొమ్మై (బిజెపి), జగదీష్‌ షెట్టర్‌ (బిజెపి)లు వరసగా మాంద్య, హవేరి, బెల్గావి స్థానాల నుంచి గెలుపొందారు. లైంగిక వేధింపుల కేసులో ఇటీవల అరెస్టయిన ప్రజ్వల్‌ రెవణ్ణ హసన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రేయాస్‌ పటేల్‌ చేతిలో ఓడారు. కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అల్లుడు రాధా కృష్ణ దొడ్దమని సమీప బిజెపి అభ్యర్థిపై విజయంసాధించారు. రాష్ట్రం లో కేంద్ర మంత్రులు ప్రహ్లద్‌ జోషి, శోభా కరండ్లేజ (బిజెపి) ధ్వరాడ, బెంగళూరు నార్త్‌ నుంచి విజయం సాధిం చారు. మరో కేంద్ర మంత్రి భగ్వాంథ్‌ కుబా బీదర్‌లో ఓటమి చెందారు.

➡️