అత్యంత అవినీతికర పార్టీ బిజెపినే

Feb 25,2024 10:47 #cpm politburo, #Prakash Karat

 బిజెపిని గద్దె దింపడమే ప్రస్తుత లక్ష్యం

 దిండిగల్‌ సభలో ప్రకాష్‌ కరత్‌

దిండిగల్‌ :   దేశంలో అత్యంత అవినీతిమయమైన పార్టీ బిజెపి అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్‌ కరత్‌ అన్నారు. తమిళనాడులోని దిండిగల్‌లో శనివారం జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన, ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా విరాళాలు అందచేసేందుకు కార్పొరేట్‌ సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ 2018లో బిజెపి కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని, దాని ప్రకారం దాత పేరు వెల్లడించాల్సిన అవసరం లేదని, ఆ రకంగా బిజెపి రూ6వేల కోట్లను వసూలు చేసిందని కరత్‌ విమర్శించారు. అదే సమయంలో మొత్తంగా ప్రతిపక్షాలన్నీ కలిపి రూ.1500కోట్లు విరాళాలు అందుకుని వుంటాయన్నారు. ఎలాంటి సిగ్గు, తత్తరపాటు, భయం లేకుండా బిజెపి ప్రభుత్వం ఇందుకు పాల్పడిందన్నారు. ఈ పద్ధతిని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆనాడే కోర్టును ఆశ్రయించిందన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలను తిరస్కరించిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఎం అని పేర్కొన్నారు. ఐదేళ్ళపాటు ఈ విషయంలో ఎటూ తేల్చని సుప్రీం కోర్టు ఎట్టకేలకు ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పిందన్నారు. దీనివల్ల అవినీతి పెచ్చరిల్లుతుందని స్పష్టం చేసిందన్నారు. అవినీతిని చట్టబద్ధం చేసిన తీరుతో బిజెపి అత్యంత అవినీతికర పార్టీగా మారిందన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళిందన్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణంతో ఇది ఆగిపోదని, సమీపంలోని మసీదులను ధ్వంసం చేయడం ద్వారా ప్రజలను వారు విభజిస్తారని విమర్శించారు. లౌకికవాద దేశం అన్న మాటకు అర్ధం కోల్పోతోందని అన్నారు. భారత రిపబ్లిక్‌ను కాపాడే ఏకైన లక్ష్యంతో మనందరం ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని పరిరక్షించాల్సిన బృహత్తర బాధ్యత ప్రతిపక్షాలపై వుందన్నారు. ఫాసిస్ట్‌ బిజెపిని అధికారం నుండి పారద్రోలాలని పిలుపిచ్చారు. బిజెపి సాగించే హిందూత్వ మతోన్మాద రాజకీయాల వల్ల భవిష్యత్‌ సురక్షితంగా వుండన్నారు. దేశంలో బడా పెట్టుబడిదారులకు పాలక పార్టీ బహిరంగంగానే కొమ్ము కాస్తోందన్నారు. వారి వ్యాపార సామ్రాజ్యాలకు అవసరమైన ఆర్థిక, వాణిజ్య విధానాలను అనుసరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్ష నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు లక్ష్యంగా మారుతున్నారని విమర్శించారు. ఒకవేళ వారెవరైనా బిజెపిలో చేరితే ఇక వారిపై ఎలాంటి కేసులు, దాడులు వుండవన్నారు. మరోసారి బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకునే ధ్యేయంతో 26 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి లక్ష్యంతో ఏక తాటిపైకి వచ్చాయన్నారు. బిజపిని ఏకాకిని చేసి, సమైక్యంగా పోరు సల్పడంలో సిపిఎం తన వంతు పాత్ర సమర్ధవంతంగా పోషిస్తుందని కరత్‌ చెప్పారు.

➡️