లౌకిక వాదానికి బిజెపి చరమగీతం : సీతారాం ఏచూరి

Jan 30,2024 18:16 #kerala, #Sitaram Yechury

తిరువనంతపురం  :   అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో బిజెపి లౌకికవాదానికి చరమగీతం పాడిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. ఎన్నికలే లక్ష్యంగా అయోధ్యలో రాజకీయ కార్యక్రమం జరిగిందని, ఇది రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తారు. సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం అనంతరం తిరువనంతపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

ఎన్నికల ముందు బిజెపి మత అజెండాను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. అయోధ్య ముగియడంతో… కాశీ, మధుర దేవాలయాలపై ఇప్పటికే పలు ప్రచారాలను ప్రారంభించిందని దుయ్యబట్టారు. సిపిఎం మత విశ్వాసాన్ని గౌరవిస్తుందని, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వినియోగించడాన్ని వ్యతిరేకిస్తోందని అన్నారు. బిజెపియేతర ప్రభుత్వాలపై ఈడితో దాడులు చేయిస్తోందని, బిజెపి హిందుత్వ ఎజెండాను ఇండియా ఫోరం ఎదుర్కోవాలని అన్నారు. ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ గవర్నర్‌ పదవికి తగినవాడు కాదని అన్నారు. కేరళ ప్రభుత్వంపై రాజకీయ ప్రేరేపిత హింసకు గవర్నరే బాధ్యత వహించాలని ఏచూరి అన్నారు.

➡️