రాహుల్‌ను ఆశీర్వదించండి

May 17,2024 23:10 #Sonia Gandhi, #speech

– రాయబరేలి గడ్డతో వందేళ్ల అనుబంధం
– లోక్‌సభ తొలి ఎన్నికల ప్రచార సభలో సోనియాగాంధీ
రాయబరేలి : ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి తన కుటుంబం లాంటిదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్‌ గాంధీని కూడా అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆశలను రాహుల్‌ ఏమాత్రం వమ్ము చేయరని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి సోనియాగాంధీ రాయబరేలిలో శుక్రవారం నాడు ప్రసంగించారు. సోనియాగాంధీతో పాటు ఆయన కుమారుడు, రాయబరేలి కాంగ్రెస్‌ అభ్యర్థి రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీ కూడా ఈ బహిరంగ సభలో పాల్గన్నారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ రాయబరేలితో తనకు, తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు. ‘చాలా కాలం తర్వాత మీ మధ్యకు రాగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంపీగా మీకు సేవలందించే అవకాశం నాకు కలిగించారు. నా జీవితంలో ఎప్పటికీ దీన్ని మరిచిపోలేను. గత వందేళ్లుగా ఈ గడ్డతో మా కుటుంబ అనుబంధం వేళ్లూనుకుని ఉంది. ఈ అనుబంధం గంగాజలంలా స్వచ్ఛమైనది. అవథ్‌, రాయబరేలిలో రైతుల ఆందోళనతో ఈ అనుబంధం మొదలైంది’ అని సోనియాగాంధీ పేర్కొన్నారు. రాయబరేలి ప్రజలు, మాజీ ప్రధాని, కీర్తిశేషులు ఇందిరా గాంధీ ద్వారా తాను నేర్చుకున్న పాఠాలే తన పిల్లలైన రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీకి నేర్పానని చెప్పారు. రాయబరేలి ప్రజలకు ఇందిరాగాంధీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉండేదని, ఆమె పనితీరును తాను చాలా దగ్గర నుంచి పరిశీలించానని, ఇక్కడి ప్రజలంటే ఆమెకు ఎనలేని అభిమానం ఉండేదన్నారు. ఇందిరాంగాంధీ నుంచి నేర్చుకున్న పాఠాలనే తాను తన పిల్లలకు చెప్పానని తెలిపారు. అందరినీ గౌరవించడం, బలహీనులను పరిరక్షించడం, ప్రజల హక్కులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోరాడటం, ఎలాంటి భయాలకు తావీయకుండటం వంటి పాఠాలు వారికి నేర్పానని చెప్పారు.
ఎప్పుడూ ఒంటరినని అనుకోలేదు…
రాయబరేలి ప్రజల ప్రేమ కారణంగా తనకు ఒంటరిగా ఉన్నాననే భావన ఎప్పుడూ కలగలేదని సోనియాగాంధీ అన్నారు. ‘ఈరోజు నా కుమారుడిని మీ చేతుల్లో పెడుతున్నాను. అతన్ని ఆదరించండి. నన్ను ఎలా ఆదరించాలో నా కుమారుడిని కూడా గుండెల్లో పెట్టుకోండి. రాహుల్‌ మీ ఆశలను వమ్ము చేయడు’ అంటూ సోనియా భావోద్వేగానికి గురయ్యారు. రాహుల్‌ గాంధీ ప్రస్తుతం పోటీ చేస్తున్న రాయబరేలి నియోజకవర్గానికి సోనియాగాంధీ 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మే 20న రాయబరేలిలో పోలింగ్‌ జరుగనుంది.

➡️