కుమారుని నామినేషన్‌ వేళ బ్రిజ్‌భూషణ్‌ భారీ హంగామా

May 4,2024 23:27 #2024 election, #Brijbhushan

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ కైసర్‌గంజ్‌ స్థానానికి బిజెపి అభ్యర్థిగా శనివారం నామినేషన్‌ వేసిన సందర్భంగా తన అనుచరులతో హల్‌చల్‌ చేశారు. నామినేషన్‌కు ముందు నిర్వహించిన సభకు వేలాది మందిని తరలించారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్‌లు, బిజెపి స్థానిక నేతలు, అయోధ్యలోని ప్రముఖ అఖాడాలకు చెందిన పెద్దలు ఉన్నారు. అలాగే 500-700 వరకు వాహనాలను మైదానంలో పార్క్‌ చేసినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక వేదికపై అంతా కుర్చీల్లో కూర్చోగా.. బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం ఒక రాజు వలే మధ్యలో ఒక సోఫాలో కూర్చున్నారు. చేతిలో మైక్రోఫోన్‌ పట్టుకొని అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు పర్యాయాలుగా బ్రిజ్‌భూషణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లైంగిక వేధింపుల వ్యవహారంలో గతేడాది జనవరిలో సాక్షి మలిక్‌, బజ్‌రంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో భాజపా హైకమాండ్‌ ఆయనను పక్కనబెట్టింది. కాగా యూపీలో అతిపెద్ద బాహుబలి నేతల్లో ఒకరిగా బ్రిజ్‌భూషణ్‌కు పేరుంది. భారీ సంఖ్యలో కేసులు ఉన్నప్పటికీ.. ఎంపీగా ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ ‘పేరు’ సంపాదించారు. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాల్లో ఆయన హవా కొనసాగుతోంది. దీన్ని దష్టిలో ఉంచుకునే లైంగిక వేధింపుల కేసులున్నా కైసర్‌గంజ్‌ స్థానంలో బిజెపి ఆయన కుమారుడికి అవకాశం కల్పించింది.

➡️