బిజెపి నుంచి పోటీ చేయండి : కేరళ గవర్నర్‌పై బృందాకరత్‌ విసుర్లు

brinda karat on kerala governor

 

తిరువనంతపురం : కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తీరుపై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన నేరుగా రాజకీయాల్లోకి రావాలనీ, 2024 సాధారణ ఎన్నికల్లో ఆయన బిజెపి నుంచి పోటీ చేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించించారు. గవర్నర్‌.. రాష్ట్ర ప్రభుత్వంతో పలు అంశాల్లో విభేదిస్తూ సర్కారుపై ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. పెండింగ్‌ యూనివర్సిటీ బిల్లుల విషయంతో పలు సందర్భాల్లో ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో బిజెపి ప్రతినిధిలా జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గవర్నర్‌ తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బృందాకరత్‌ పై విధంగా స్పందించారు. ”గౌరవ గవర్నర్‌కు నేరుగా రాజకీయాల్లో రావాలనే ఆసక్తి ఉంటే రావాలి. షెడ్యూల్‌ ప్రకారం 2024 లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. ఆయన తన రాజకీయ ఔన్నత్యాన్ని కొలవాలనుకుంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. బహుశా, కేరళ గవర్నర్‌ నేరుగా ఎన్నికల రాజకీయాల్లోకి రావటం మరింత సముచితం. బీజేపీ టికెట్‌ తీసుకొని కేరళలోని ఏ స్థానం నుంచైనా పోటీ చేయాలి’ అని బృందా కారత్‌ అన్నారు. రోజువారీ బహిరంగ ప్రకటనలు చేస్తూ తన సొంత పదవిని కించపరిచే బదులు, ముఖ్యమంత్రితో ఆయనకున్న విభేదాలను గవర్నర్‌ తొలగించుకోవాలని సూచించారు.

➡️