సిఎఎ, ఎన్‌ఆర్‌సి భయంతో పత్రాల కోసం పరుగులు

Apr 12,2024 08:06 #CAA, #Mumbai, #Muslim student
  •  ముంబయిలో ముస్లింల అవస్థలు
  •  సాయం అందించేందుకు ఉదారంగా ముందుకొస్తున్న న్యాయవాదులు

న్యూఢిల్లీ : సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టం) అమలు, ఎన్‌ఆర్‌సి భయం ముంబయిలో నెలకొంది. మరీ ముఖ్యంగా ముస్లింలలో తీవ్ర భయాందోళనలు చోటుచేసుకున్నాయి. పౌరసత్వ గుర్తింపునకు సంబంధించిన పత్రాలు సరిగా ఉన్నాయో, లేదో చూసుకోవడానికి వారు న్యాయవాదుల వద్దకు పరుగులు తీస్తున్నారు. వీరి అవస్థలను గమనించిన కొందరు న్యాయవాదులు ఉచితంగా సేవలందించేందుకు ఉదారంగా ముందుకొస్తున్నారు. తమ ఆధార్‌ కార్డులు, జనన ధ్రువపత్రాలు వంటి వాటిల్లో తమ వివరాలు సక్రమంగా ఉన్నాయో, లేదో అనే విషయాన్ని ముస్లింలు వెరిఫికేషన్‌ చేసుకుంటున్నారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సి తుది జాబితా నుంచి సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా సుమారు 19.6 లక్షల మందిని తొలగించిన అంశం ముస్లింలను కలవరపాటుకు గురిచేస్తోంది. తమకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ మాసంలో కూడా ఇదే ఆందోళనలో ఉన్నారు. ఉదాహరణకు మహమ్మద్‌ అనేది ముస్లిమ్‌లలో చాలా సాధారణమైన పేరు. ఈ పేరు ఉన్న కొందరి డాక్యుమెంట్లలో ఎం అని మాత్రమే రాసి ఉంటుంది. మరి కొన్ని వాటిల్లో మొహమ్మద్‌ అని రాసి ఉంటుంది. మరికొన్నింటిల్లో ఎంఒహెచ్‌డి అని ఉంటుంది. ఇలా ఒక పేరే వేర్వేరుగా ఉండటంతో అధికారులు అంగీకరిస్తారో, లేదో అనే ఆందోళన ముస్లిమ్‌లలో నెలకుంది. ముస్లిములకు సంబంధించిన అనేక పేర్లల్లో ఇదే సందిగ్ధం ఉంది. దీంతో తమకు న్యాయసహాయం అందించే వారి వద్దకు పరుగులు తీస్తున్నారు.
ముంబయి సెంట్రల్‌లోని నాగ్‌పడా జంక్షన్‌కు సమీపంలో 43 ఏళ్ల న్యాయవాది నదీమ్‌ సిద్ధిఖీ తన కార్యాలయంలోనే గత కొన్నేళ్ల నుంచి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నారు. సిఎఎ రూల్స్‌ నోటిఫై అయిన దగ్గర నుంచి తమ వద్దకు సహాయార్ధం వచ్చే ముస్లిముల సంఖ్య భారీగా పెరిగిందని చెబుతున్నారు. నలుగురు వాలంటీర్ల సహాయంతో ఆదివారం మినహాయించి ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ, మళ్లీ రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి వరకూ ఈ సేవలు అందిస్తున్నారు. సిద్ధిఖీ లాంటి సహాయం అందించే ఇతర న్యాయవాదులు, సంస్థల వద్దకు ముస్లింలు బారులు తీరుతున్నారు. తమ వ్యక్తిగత సమాచారం, ముఖ్యంగా తమ పేర్లు ఇతర గుర్తింపు పత్రాలతో సరిపోలుతున్నాయా, లేదా అని నిర్థారణ చేయమంటున్నారు. పేర్లలో తప్పులు సరిదిద్దడానికి కనీసం నాలుగు నెలలు పడుతుందని తెలియడంతో వారిలో ఆందోళన మరింతగా పెరుగుతోంది.

➡️