పాస్‌పోర్ట్‌లు, వీసాలు రద్దు

ఆందోళన చేసిన రైతులపై హర్యానా సర్కారు కక్షసాధింపు

ఖనౌరీ సరిహద్దు వద్ద శుభకరన్‌ భౌతిక కాయానికి ఘన నివాళి

హత్య కేసు నమోదు చేసిన పంజాబ్‌ పోలీసులు

17వ రోజూ రైతుల ఆందోళన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టిన రైతులపై హర్యానా పోలీసులు కుట్ర పూరిత, బెదిరింపు చర్యలకు సిద్ధమయ్యారు. పంటలకు కనీస మద్దతు ధరసహా పలు డిమాండ్ల సాధనకు జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న పలువురు రైతులను గుర్తించి, వారి పాస్‌పోర్ట్‌లు, వీసాలను రద్దు చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై రైతులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 21న ఖనౌరీ సరిహద్దులో సిఆర్‌పిఎఫ్‌ బలగాలు, హర్యానా పోలీసులు రబ్బరు బుల్లెట్లు, పెల్లెట్‌ గన్‌లతో దాడి చేయడంతో యువరైతు శుభకరన్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పంజాబ్‌ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు రైతులు, కుటుంబ సభ్యులు అంగీకరించారు. బుధవారం రాత్రి పోస్టుమార్టం చేశారు. రాజింద్ర ఆస్పత్రి నుంచి ఖనౌరీ సరిహద్దుకు శుభకరన్‌ సింగ్‌ భౌతిక కాయాన్ని అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అక్కడ రైతులు, నాయకులు నివాళులర్పించారు. ఆయన భౌతికకాయంపై తమ సంఘాల జెండాను కప్పారు. గురువారం మధ్యాహ్నం బటిండాలోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. అంబులెన్స్‌ వెంట నడిచిన రైతులు ‘అమర్‌ షహీద్‌ శుభకరన్‌ సింగ్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు. ఆయన మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు.17వ రోజూ కొనసాగిన రైతుల ఆందోళన రైతులు పండించిన అన్ని పంటలకు సి2ప్లస్‌50 శాతంతో కూడిన ఎంఎస్‌పి హామీతో పంట సేకరణ చట్టం తీసుకురావాలని, రైతులకు రుణ విముక్తి కోసం రైతు రుణమాఫీ చేయాలని, బీమా సదుపాయం కల్పించాలని, పెన్షన్‌ ఇవ్వాలని, ఇన్‌పుట్‌ సబ్సిడీ పలు పెంచాలని, విద్యుత్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టే ఆందోళన గురువారానికి 17 రోజుకు చేరుకుంది. హర్యానా-పంజాబ్‌ సరిహద్దులు శంభూ, ఖానౌరీ ప్రాంతాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. టెంట్లు, ట్రాలీ వాహనాల్లో ఉంటూ, రోడ్లపైనే రాత్రింబవళ్లు ఆందోళన చేస్తున్నారు.

➡️