Chhattisgarh : జూన్‌ 25 వరకు వేసవి సెలవులు పొడిగింపు

రాయ్‌పూర్  :   అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగించింది. ఈ నెల 25 వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు.  ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన వేడి వాతావరణం కారణంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవులను జూన్‌ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్‌ 26 నుండి స్కూల్‌లు పున:ప్రారంభం కానున్నాయని తెలిపింది.

ఆదివారం రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాజ్‌నంద్‌గావ్‌లో 39 డిగ్రీలు, పెండ్రాలో 40.2 డిగ్రీలు, బిలాస్‌పూర్‌లో 30.8 డిగ్రీలు, అంబికాపూర్‌లో 32.6 డిగ్రీలు, జగదల్‌పూర్‌లో 35.2 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కొనసాగనున్నట్లు హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చని అంచనావేసింది.

➡️