‘ఇండియా’ అధికారంలోకి వస్తే మోదానీ మెగా స్కామ్‌పై జెపిసితో దర్యాప్తు : కాంగ్రెస్‌ హామీ

May 23,2024 00:30 #Congress, #enquiry, #Guaranteed

న్యూఢిల్లీ : ఎన్నికల తరువాత కేంద్రంలో ఇండియా వేదిక అధికారంలోకి వచ్చిన వెంటనే మోదానీ మెగా స్కామ్‌పై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్‌ బుధవారం హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జై రార రమేష్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. మోదానీ మెగా స్కామ్‌ గురించి ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్టు (ఓసిసిఆర్‌పి) తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రచురించాయి. ఈ నివేదిక ప్రకారం 2014లో ఇండోనేషియా నుంచి తక్కువ నాణ్యత, అధిక బూడిదతో ఉన్న బగ్గును అదానీ గ్రూపు తక్కువ ధరకు డజన్ల కొద్ది నౌకలతో కొనుగోలు చేసి, దానికి మూడు రెట్లు అధిక ధరకు ప్రభుత్వ రంగ సంస్థ తమిళనాడు జనరేషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌(టిఎన్‌జిఇడిసిఒ)కు విక్రయించింది. ఈ స్కామ్‌పై జెపిసి దర్యాప్తు చేస్తుందని జై రాం రమేష్‌ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు. ‘ఈ స్కామ్‌ ద్వారా అదానీ గ్రూపు కనీసం రూ 3 వేల కోట్ల రూపాయిల అదనపు లాభాలను ఆర్జించింది. మరోవైపు ప్రజలు అధిక విద్యుత్‌ ధరలు, పెరిగిన వాయు కాలుష్యం బారీన పడ్డారు’ అని జై రాం రమేష్‌ విమర్శించారు. ‘ప్రధాన మంత్రి సన్నిహితులు గత 10 ఏళ్లలో చట్టాలను ఉల్లంఘించడం, అత్యంత పేద భారతీయులను దోపిడీ చేయడం ద్వారా సంపన్నులుగా మారారు. వారి నేరాలకు ఇది మరొక ఉదాహరణ. వాయు కాలుష్యం వలన ఏటా 20 లక్షల మంది భారతీయులు మృతి చెందుతున్నారు. ప్రధాని మోడీ, అతని క్రోనీలకు అమృత్‌ కాల్‌ అయితే, మిగిలిన వారందరికీ విష కాల్‌’ అని జైరాం రమేష్‌ విమర్శించారు. ‘దేశంలో అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయకుండా ప్రధానమంత్రి సహాయం చేసి ఉండోచ్చు. అయితే ఇండోనేషియా, ఇతర దేశాల నుంచి వస్తున్న సమాచారం, పరిశోధనలు నిజానిజాలను వెల్లడిస్తున్నాయి’ అని రమేష్‌ తెలిపారు. వచ్చే నెలలో ఇండియా వేదిక అధికారంలోకి ఇవన్నీ మారతాయని అన్నారు. బగ్గు, విద్యుత్‌ పరికరాల అక్రమ ఓవర్‌ ఇన్‌వాయిస్‌, 20 వేల కోట్ల రూపాయిల అక్రమ ఆదాయాన్ని మళ్లీ అదానీ గ్రూపులకు మళ్లించడం వంటి ‘మోదానీ మెగాస్కామ్‌’పై ఒక నెలలోనే జెపిసిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశ వినియోగదారులు చెల్లించిన అధిక విద్యుత్‌ ఛార్జీలు, విమానాశ్రయ రుసుములు ప్రధానమంత్రి సన్నిహితలను ధనవంతులు చేయడం వంటి ప్రతీ అంశంపైనా దర్యాప్తు జరుగుతోందని జైరార రమేష్‌ హామీ ఇచ్చారు.

➡️