పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బిజెపి

Apr 13,2024 23:15 #Congress vs BJP, #Puducherry

– పోటీ పెట్టకుండా బిజెపికి వదిలేసిన సిఎం రంగస్వామి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-పుదుచ్చేరి :కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందు రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ ఇండియా ఫోరం తరపున డిఎంకె, వామపక్షాలు, విసికె బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఎఐఎన్‌ఆర్సి పార్టీ నేత, ముఖ్యమంత్రి ఎన్‌. రంగస్వామి బలపరిచిన బిజెపి అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇటివల ఎన్డిఎ నుంచి బయటకొచ్చిన అన్నాడిఎంకె సైతం పోటీలో ఉంది. మూడు పార్టీలు పోటీ చేయడంతో పుదుచ్చేరిలో త్రిముఖ పోటీ నెలకొంది. ఏది ఏమైనా బిజెపి గెలుపు అంత సులువేం కాదని తెలుస్తోంది. ఇక్కడ ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరగనున్నాయి.

ఎల్‌జిల తలనొప్పి
పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో ప్రతిదానిలో లెఫ్టినెంట్‌ గవర్నర్లు జోక్యం చేసుకుంటున్నారు. దీంతో ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేయడానికి రాజీనామా చేసిన ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళ సై సౌందరరాజన్‌, ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి సమాంతరంగా పరిపాలన చేశారని, ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి అని ప్రతిపక్షం విమర్శించింది. దీనిపై ముఖ్యమంత్రి రంగస్వామి స్పందించాలని డిమాండ్‌ చేసింది. అలాగే అంతకు ముందు ఉన్న పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ కూడా ఇలానే వ్యవహరించారని, ఆమెను తప్పించాలని స్వయానా నాటి ముఖ్యమంత్రి నారాయణ స్వామిమి కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర హోదా డిమాండ్‌
పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. దాన్ని కేంద్రానికి పంపారు. ఇప్పటికీ మోక్షం రాలేదు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డిఎ ప్రభుత్వం ఉంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పుదుచ్చేరికి ఎందుకు రాష్ట్ర హోదా ఇవ్వలేదని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇస్తామని పేర్కొంది.
సామాజిక పరిస్థితులు
పుదుచ్చేరిలో ప్రదానంగా తమిళం, మలయాళం, తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. పుదుచ్చేరి, కారైకాల్‌ దక్షిణ స్థావరాలలో తమిళం ప్రధానమైనది. మహీలో మలయాళం ఎక్కువగా ఉంది. తెలుగు ప్రధానంగా యానాంలో మాట్లాడతారు. ఉర్దూ, ఫ్రెంచ్‌, కన్నడ, హిందీ, గుజరాతీ, ఇంగ్లీష్‌, మరాఠీ కూడా ఉన్నాయి. నాలుగు ప్రాంతాలలో హిందువులు మెజారిటీగా ఉన్నారు. పుదుచ్చేరి, కారైకల్‌, మాహే, యానాంలో ముస్లింలు ముఖ్యమైన మైనారిటీగా ఉన్నారు. పుదుచ్చేరిలో క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నారు. కొంతమంది సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా ఉన్నారు.హిందువులు 83.39 శాతం, క్రైస్తవులు 10.88 శాతం, ముస్లింలు 4.37 శాతం ఉన్నారు. పుదుచ్చేరిలో ఎస్సి 16.19 శాతం, వన్నియర్‌ 39 శాతం,
ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ
పుదుచ్చేరిలో ఒకే ఒక ఎంపి స్థానం ఉంది. అక్కడ ప్రస్తుత కాంగ్రెస్‌ ఎంపి వి.వైతిలింగం ఉన్నారు. ఆయనే తిరిగి ఇండియా ఫోరం తరపున పోటీ చేస్తున్నారు. అన్నాడిఎంకె నుంచి తమిజ్వేందన్‌ బరిలో ఉన్నారు. బిజెపి అభ్యర్థిగా ప్రస్తుత పుదుచ్చేరి హోం మంత్రి ఎ. నమశ్శివాయం పోటీ చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌, బిజెపిల మధ్యే కీలక పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రంగస్వామి తన పార్టీ ఎఐఎన్‌ఆర్సి తరపున అభ్యర్థిని బరిలోకి దింపకపోవడంపై ఆ పార్టీలో అసంతృప్తి పెరిగింది. మొత్తం ఓట్లు: 10,20,914, పురుషులు, 4,79,329, మహిళలు 5,41,437, ట్రాన్స్‌ జండర్‌ 148.

➡️