చివరి పార్లమెంట్‌ సెషన్‌లో ప్రధాని మోడీ ప్రసంగం

Feb 7,2024 15:03 #Parliament Session, #PM Modi

న్యూఢిల్లీ :   సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పార్లమెంట్‌ సెషన్‌లో బుధవారం ప్రధానిమోడీ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించారు. రాష్ట్రపతి ప్రసంగంపై కొందరు అభిప్రాయాలు తెలిపితే.. మరికొందరు విమర్శించారని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తన ప్రసంగాన్ని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తనకు మాట్లాడే అధికారానిన ప్రజలు కట్టబెట్టారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రాత్రికి రాత్రే కూల్చివేసిందని, పత్రికా స్వేచ్ఛను కాలరాసిందని అన్నారు. ఇప్పుడు దేశాన్ని ఉత్తరం, దక్షిణం అంటూరెండు ముక్కలు చేసేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేపై కూడా విమర్శలు గుప్పించారు. ఖర్గే స్వేచ్ఛగా మాట్లాడుతున్నారని, అయితే ఆయన అంతస్వేచ్ఛగా ఎలా మాట్లాడుతున్నారని తనకు ఆశ్చర్యం వేసిందని అన్నారు. అయితే ”స్పెషల్‌ కమాండర్స్‌”  లేకపోవడంతో ఖర్గే ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారని అర్థమైందని చెప్పారు.  తమ పార్టీ 400 సీట్లు గెలుచుకుంటుందని ఖర్గే ఆశీర్వదించారని అన్నారు. కానీ కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని, ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ చెప్పారని అన్నారు. ఆలోచనల్లోనూ కాంగ్రెస్‌ అవుట్‌డేటెడ్‌ అయ్యిందని, అందుకే అవుట్‌ సోర్సింగ్‌ ఇస్తోందని చెప్పారు. అంబేద్కర్‌కు కాంగ్రెస్‌ భారతరత్న ఇవ్వాలనుకోలేదు. కానీ తమ కుటుంబ సభ్యులకు మాత్రం భారత రత్న ప్రకటించుకున్నారని అన్నారు. చూస్తుండగానే కాంగ్రెస్‌ పరిస్థితి దిగజారిపోయిందని అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయని అన్నారు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్‌ పాఠాలు చెప్పడం విచిత్రంగా ఉందని అన్నారు. ఆర్థికవ్యవస్థ పురోగతిని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా కొనియాడారని అన్నారు. పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను ఐదోస్థానానికి తీసుకువచ్చామని అన్నారు. యుపిఎ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని అన్నారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారని, అవి దేశాన్ని అస్థిర పరుస్తాయని వాదించారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీనిస్థాపించిందే ఓ బ్రిటీషర్‌ అని,భారతీయ సంస్కృతిని అసహ్యించుకున్నది కాంగ్రెస్‌ పార్టీనేనని చెప్పుకొచ్చారు. బ్రిటన్‌ పార్లమెంట్‌ను ఎలా నడిపితే.. మనదేశ పార్లమెంటును అలా నడిపించారని అన్నారు. విదేశీ వస్తువులను స్టేటస్‌ సింబల్‌గా వినియోగించిందని అన్నారు.

ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్‌ వ్యతిరేకమని, ఆర్టికల్‌ 370ని దశాబ్దాలపాటు కొనసాగించారని అన్నారు. కాంగ్రెస్‌ కావాలనే అట్రాసిటీ యాక్ట్‌లో జమ్ముకాశ్మీర్‌ను చేర్చలేదని అన్నారు. ఆర్టికల్‌ 370ని తొలగించి దళితులకు న్యాయం చేశామని అన్నారు. యుద్ధ వీరులను కాంగ్రెస్ గౌరవించలేదని,  అమరవీరుల కోసం ఒక్క మెమోరియల్‌ను కూడా నిర్మించలేదని అన్నారు.  ఒబిసి కావడంతోనే సీతారాం కేసరిని కాంగ్రెస్‌ వేధించిందని అన్నారు.

➡️