రైతు నేతలపై చర్యల వెనుక కుట్ర : ఎస్‌కెఎం నేతలు

  • లిఖిత పూర్వక వాగ్దానాల ఉల్లంఘనే
  • 11న అన్ని జిల్లా కలెక్టర్లకు వినతులు
  • రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖలు
  • విలేకరుల సమావేశంలో ఎస్‌కెఎం నేతలు

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : రైతు నేతలపై ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఐఎ దాడుల వెనుక కుట్ర ఉందని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) సమన్వయ కమిటీ నేతలు విమర్శించారు. శనివారం నాడిక్కడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌కెఎం నేతలు దర్శన్‌పాల్‌, రాకేష్‌ తికాయత్‌, పి కృష్ణప్రసాద్‌, ప్రేమ్‌ సింగ్‌, సత్యవాన్‌, కుల్దీప్‌ పునియా మాట్లాడారు. ‘2020-21 చారిత్రాత్మక రైతు ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని కేంద్రప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. నవంబర్‌ 28న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎస్‌కెఎం కౌన్సిల్‌ సభ్యుడు, రైతు నాయకుడు యుధ్వీర్‌ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతు సంఘాల నిరసనతో విడుదల చేశారు. హర్యానా రైతు నాయకుడు వీరేంద్ర సింగ్‌ హుడాకు నవంబర్‌ 22న ఢిల్లీ సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని నోటీసు అందింది. గతేడాది డిసెంబర్‌ 7న బికెయు నేత అర్జున్‌ బల్యాన్‌ నేపాల్‌ వెళ్లకుండా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్‌కు చెందిన ఎస్‌కెఎం నాయకులు సత్నామ్‌ సింగ్‌ బెహ్రూ, హరీందర్‌ సింగ్‌ లోకోవాల్‌ ఢిల్లీ రైతుల పోరాటానికి సంబంధించి ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నారు. కేంద్రప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కేసులను తక్షణమే ఉపసంహరించుకోవడానికి పూర్తిగా అంగీకరించాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజరు అగర్వాల్‌ సంతకం చేసి 2021 డిసెంబర్‌ 9న ఇచ్చిన లిఖిత పూర్వక లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. రైతుల పోరాటానికి సంబంధించి ఇంకా, కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన విభాగాలు అన్ని కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా అంగీకరించాయి. రైతుల పోరాటంపై కేసులను ఉపసంహరించుకోవాలని అన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అభ్యర్థించినట్టు లేఖలో పేర్కొన్నారు. రైతు చారిత్రాత్మక పోరాటం సందర్భంగా రైతులపై దాఖలు చేసిన 86 కేసులను ఉపసంహరించుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రాజ్యసభలో సమాధానమిచ్చారు. అందుకు భిన్నంగా రైతు నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) లుకౌట్‌ నోటీసు జారీ చేసింది. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తన వైఖరిని స్పష్టం చేయాలి. రైతు నాయకులకు జరిగిన అవమానం, అసౌకర్యానికి కేంద్ర హోంమంత్రి క్షమాపణ చెప్పాలి. ఈ చట్టవిరుద్ధమైన, ప్రతీకార చర్యకు పాల్పడిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్‌ చేశారు.

రైతు ఉద్యమాన్ని అణచివేయడానికి మోడీ ప్రభుత్వ చట్టవిరుద్ధమైన వ్యూహాలను ప్రతిఘటించేందుకు ఎస్‌కెఎం కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటించిందన్నారు. ఎస్‌కెఎం నేతలపై కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఈ నెల 11న జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతి, హోంశాఖ కార్యదర్శికి వినతిపత్రం పంపనున్నామని తెలిపారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరామని, కేంద్రప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడానికి మెమోరాండంను సమర్పిస్తామని చెప్పారు. ఎస్‌కెఎంకు చేసిన రాతపూర్వక వాగ్దానాలను కేంద్రప్రభుత్వం ఉల్లంఘించకూడదని, ప్రతీకార చర్యకు దూరంగా ఉండాలని అన్నారు. ఎస్‌కెఎం నాయకులపై జారీ చేసిన లుకౌట్‌ నోటీసులు, పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎస్‌కెఎం హోం సెక్రటరీకి మెమోరాండం సమర్పిస్తుందని తెలిపారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఢిల్లీలో రైతుల పోరాటం జరిగిందని గుర్తు చేశారు. రైతు నేతలను క్రిమినల్‌ కేసుల్లో ఇరికించే ప్రస్తుత విధానం మోడీ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు. అటువంటి చర్యలను ఎస్‌కెఎం గట్టిగా తిప్పికొడుతుందని, కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించడానికి ఎన్‌ఐఎ, ఇతర దర్యాప్తు సంస్థలను ఎందుకు ఉపయోగిస్తున్నారో హోం మంత్రి అమిత్‌ షా వివరించాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఉద్యమంపై ప్రతీకారం తీర్చుకునే ఏ చర్యనైనా దేశం అంతటా భారీ పోరాటాలతో ఎదుర్కొంటామని ఎస్‌కెఎం నేతలు హెచ్చరించారు.

➡️