contaminated water : మహారాష్ట్రలో కలుషిత నీరు తాగి వంద మందికి అస్వస్థత

Jul 1,2024 15:34 #Maharashtra, #polution, #the well, #water

ముంబై : మహారాష్ట్రలో నాందేడ్‌ జిల్లాలో కలుషిత నీరు తాగి సుమారు వందమంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యబృందాలు అక్కడికి చేరుకుని అస్వస్థతకు గురైన వారిని చికిత్సకోసం ఆసుపత్రికి తరలించాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నాందేడ్‌ జిల్లాలోని ముగావ్‌ తండ్రా గ్రామంలో 107 ఇళ్లు, 440 జనాభా ఉన్నారు. ఈ గ్రామస్తులు బావి నుంచి సరఫరా అయిన కలుషిత నీటిని తాగి జూన్‌ 26,27 తేదీల్లో 93 మంది గ్రామస్తులు కడుపునొప్పి, విరోచనాలతో బాధపడ్డారు. సమాచారం అందుకున్న వైద్యులు వీరిలో 56 మంది స్థానిక ఆరోగ్య కేంద్రంలో, మరో 37 మందిని పొరుగునున్న మంజరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించి చికిత్సనందించారు. ఇక వైద్య బృందాలు ముగావ్‌ తండా గ్రామంలోనే ఉండి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆ బావి నుంచి గ్రామానికి సరఫరా అయ్యే నీటి నమూనాలు సేకరించి పరీక్షించారు. బావిలో నీరు కలుషితం కావడం వల్లే వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. అందుకే వెంటనే ఆ బావిని మూసివేసి.. సమీపంలోని ఫిల్టర్‌ ప్లాంట్‌ నుంచి తాగునీటిని గ్రామస్తులకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

➡️