విజృంభిస్తోన్న కొవిడ్‌ .. 594 కేసులు .. ఆరుగురు మృతి

Dec 22,2023 14:23 #COVID-19, #new corona cases

 న్యూఢిల్లీ :    భారత్‌లో మరోసారి కొవిడ్‌ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జెఎన్‌.1 సబ్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందుతోంది. గురువారం 594 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారంతో పోలిస్తే యాక్టివ్‌ కేసులు 2,311 నుండి 2,669కి పెరిగాయి. ఒక్క కేరళలోనే 265 కేసులు నమోదైనట్లు తెలిపింది.  కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, పంజాబ్‌లో ఒకరు సహా మొత్తం ఆరుగురు మరణించగా, మృతుల సంఖ్య 5,33,327కి చేరింది.

ఈ వేరియంట్‌ను భారత్‌ నిశితంగా పరిశీలిస్తోందని నీతి అయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్‌ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్రాల్లో పరీక్షలను వేగవంతం చేశామని అన్నారు. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్యలో పెరుగుదల లేదని చెప్పారు. కర్ణాటకలో మాస్క్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. కేరళ, మహారాష్ట్రల్లోనూ   రద్దీ ప్రాంతాల్లో  మాస్క్‌ను  వినియోగించాల్సిందిగా   ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు   ఆదేశించాయి.

జెఎన్‌.1 అనేది ”పిరోలా” వేరియంట్‌ బిఎ 2.86 వర్గానికి చెందినదని, ఇది ఓమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ అని ఐఎంఎ కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ డాక్టర్‌ రాజీవ్‌ జయదేవన్‌ గురువారం పేర్కొన్నారు. జెఎన్‌.1 వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుందని అన్నారు.

➡️