సిఎఎపై సుప్రీంని ఆశ్రయించిన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌

Mar 12,2024 13:55 #CAA, #IUML, #Supreme Court

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) అమలుకు నిబంధనలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ సోమవారం నోటిఫై చేసింది. కేంద్రం మరోసారి సిఎఎ అమలుకు పూనుకోవడంపై కేరళ, తమిళనాడు వంటి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. తాజాగా సిఎఎ అమలును సవాల్‌ చేస్తూ కేరళలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐఎఎంఎల్‌) పార్టీ మంగళవారం సుప్రీంని ఆశ్రయించింది. సిఎఎ అమలు రాజ్యాంగ విరుద్ధమని, కేంద్ర ప్రభుత్వం ముస్లింలపట్ల వివక్ష చూపుతుందని ఐయుఎంఎల్‌ పిటిషన్‌లో పేర్కొంది. ఈ చట్టం అమలును నిలిపివేయాలని పిటిషన్‌లో కోరింది.
కాగా, 2014 డిసెంబర్‌ 31 లేదా అంతకుముందు భారతదేశంలోకి ప్రవేశించినవారికి సిఎఎ ప్రకారం పౌరసత్వం పొందే అవకాశం కల్పిస్తూ 2019లో పార్లమెంటులో ఈ చట్టాన్ని ప్రతిపక్షాల ఆమోదం లేకుండానే ఎన్‌డిఎ ఆమోదింపజేసుకుంది. 2019లో ఆమోదింపబడిన పౌరసత్వ సవరణ చట్టం వల్ల బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ నుండి భారత్‌కి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరతసత్వం పొందే అవకాశముంది. 2019 డిసెంబర్‌ 11 తర్వాత ఐయుఎంఎల్‌ పార్టీ సిఎఎను సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. పౌరసత్వం అర్హులైన వారి జాబితలో ముస్లింలను చేర్చకపోవడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం ఇది సమానత్వ హక్కును ఉల్లంఘిస్తున్నందని ఐయుఎంఎల పిటిషన్‌లో పేర్కొంది. అయితే సిఎఎ అమలుకు సంబంధించిన నిబంధనలను నోటిఫై చేయనుందున చట్టం అమలులోకి రాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇక సోమవారం కేంద్రం సిఎఎ అమలుకు నిబంధనలను నోటిఫై చేయడంతో ఐయుఎంఎల్‌ పార్టీ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్‌ దాఖలు చేసింది. చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటుకు వ్యతిరేకంగా పెండింగ్‌లో ఉన్న 250 పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేవరకు సిఎఎ నిబంధనల అమలును నిలిపివేయాలని పిటిషన్‌లో పేర్కొంది. రాజ్యాంగ పీఠిక భారతదేశం లౌకిక దేశమని సూచిస్తుంది. అందువల్ల ఆమోదించబడిన ఏదైన చట్టం మతానికి తటస్తంగా ఉండాలని పిటిషన్‌లో పేర్కొంది.

➡️