కేసు ఉపసంహరించుకుంటేనే అప్పు! : కేంద్రం షరతుకు కేరళ తిరస్కరణ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రుణ పరిమితిలో కోతను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ఒరిజినల్‌ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటేనే ఎక్కువ రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తామన్న కేంద్ర ప్రభుత్వ షరతును కేరళ తిరస్కరించింది. కేసు ఉపసంహరించుకుంటే మరో రూ.13,600 కోట్లు అప్పు తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే న్యాయమైన హక్కుల కోసమే న్యాయ పోరాటమని, దావాను ఉపసంహరించుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో స్పష్టం చేశారు. దీనిని అనుసరించి, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం కేరళ ఒరిజినల్‌ పిటిషన్‌, మధ్యంతర ఉపశమనం కోరుతూ చేసిన పిటిషన్‌పై వివరణాత్మక విచారణను మార్చి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో అక్రమంగా జోక్యం చేసుకుంటూ రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం తగ్గించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేరళ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. రూ.26,000 కోట్లు అత్యవసరంగా రుణం తీసుకోవడానికి అనుమతించాలని కేరళ ప్రత్యేక పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే.. ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునేందుకు అనుమతినివ్వాలంటే.. ముందుగా సుప్రీంకోర్టులో కేరళ వేసిన కేసును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రతికూల వైఖరిని అవలంభించిందని ఆ చర్చలోని అంశాన్ని కపిల్‌ సిబల్‌ ఎత్తిచూపారు.

‘కేసు ఉపసంహరించుకుంటే రూ.13,600 కోట్లు రుణం తీసుకునేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం, కేరళ మరో రూ.11,731 కోట్లు రుణం తీసుకోవచ్చు. ఎక్కువ డబ్బు తీసుకునేందుకు వీలుగా కేసు ఉపసంహరించుకోవాలని షరతు పెట్టడం ఆమోదయోగ్యం కాదు. ఇంధన రంగ అవసరాల కోసం అన్ని ఇతర రాష్ట్రాలు రూ.5,000 కోట్ల వరకు రుణం తీసుకునేందుకు అనుమతించారు. అయితే, కోర్టు కేసు కారణంగా కేరళకు మాత్రమే అనుమతి ఇవ్వలేదు’ కపిల్‌ సిబల్‌ వాదించారు.

కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌ వెంకటరామన్‌ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వ చర్యలను చట్టపరంగా ప్రశ్నించిన తరువాత మరిన్ని రుణాలు తీసుకునేందుకు కేరళ అనుమతి కోరడం సరికాదన్నారు. మార్గదర్శకాలకు మించి రుణం తీసుకునే హక్కును కేరళ డిమాండ్‌ చేస్తోందన్నారు. కేసు, చర్చ పరస్పర విరుద్ధం కాదని, సుప్రీంకోర్టును ఆశ్రయించకముందే కేరళ అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ రుణం తీసుకుందని వాదించారు. దానికి తోడు ఇంకా ఎక్కువ రుణాలు తీసుకునేందుకు అనుమతించాలని కోరుతుందని అన్నారు. అంతకంటే ముందు కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదులు తీవ్ర వాగ్వివాదానికి దిగడంతో ధర్మాసనం జోక్యం చేసుకుంది. ఈ అంశంపై కేంద్రం, రాష్ట్రానికి మధ్య రాజీలేని వాగ్వివాదం చోటుచేసుకున్న నేపథ్యంలో అవసరమైన జోక్యం చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఇది సంక్లిష్టమైన ఆర్థిక అంశం కాబట్టి, కోర్టు జోక్యం చేసుకోవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగం, మార్గదర్శకాల ప్రకారం తమకు దక్కాల్సిన హక్కును మాత్రమే అడుగుతున్నానని సిబల్‌ పునరుద్ఘాటించారు. దీంతో తదుపరి విచారణను మార్చి 6, 7 నాటికి ధర్మాసనం వాయిదా వేసింది.

➡️