ఓటమి పాలైన కేంద్ర మంత్రులు

Jun 5,2024 01:20 #2024 election
  • రైతులను కారుతో తొక్కించి చంపిన అజయ్ మిశ్రాకు తగిన శాస్తి
  • ఘోరంగా ఓడిపోయిన వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్ల నినాదంతో బరిలోకి దిగిన ఎన్డీయే కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మోడీ కేబినెట్‌కు చెందిన పది మంది దాకా మంత్రులు ఓటమి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో కేంద్ర మంత్రి.స్మృతి ఇరానీ అమేథీలో రెండవసారి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌కు చెందిన కిషోరి లాల్‌ శర్మ ఆమె పై 1,67,196 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరో కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా జార్ఖండ్‌లోని కుంతి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కాలి చరణ్‌ ముండా చేతిలో1,49,675 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మరో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌కు చెందిన తన ప్రత్యర్థి శశి థరూర్‌ చేతిలో ఓడిపోయారు.
యుపిలోని ఖేరీ నియోజకవర్గంలో మూడేళ్ల క్రితం కారుతో తొక్కించి అయిదుగురు రైతులను అమానుషంగా పొట్టనబెట్టుకున్న కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్‌ మిశ్రాకు తగిన శాస్తి జరిగింది. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని రైతు సంఘాలు అనేక సార్లు డిమాండ్‌ చేసినా మోడీ ప్రభుత్వం బేఖాతరు చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు ఇవ్వొద్దన్న విజ్ఞప్తిని పెడచెవిన పెట్టారు. దీంతో ప్రజలే ఓటు ద్వారా ఆయనకు తగిన బుద్ధి చెప్పారు. ఖేరీ నియోజకవర్గంలో ఎస్‌పి అభ్యర్థి ఉత్కర్ష్‌ వర్మ ‘మధుర్స చేతిలో 34,329 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మూడో స్థానంలో కేంద్రమంత్రి
రాజస్థాన్‌లోని బార్మర్‌ నియోజకవర్గంలో కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉమీద రామ్‌ బెనివాల్‌ విజయం సాధించారు. రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి రవీంద్ర సింగ్‌ భట్టి నిలవగా కేంద్ర మంత్రి కైలాష్‌ చౌదరి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ కూడా ఓటమి చవి చూశారు. మురుగన్‌ పై డిఎంకె అభ్యర్థి ఎ. రాజా 2,40,585 ఓట్ల మెజార్టీతో గెలిచారు.ముజఫర్‌నగర్‌ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి సంజీవ్‌ కుమార్‌ బల్యాన్‌ ఓటమి చవి చూశారు.

జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల ఓటమి
జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఓటమి చవి చూశారు. బారాముల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, పిడిపికి కంచుకోటగా ఉన్న అనంత్‌నాగ్‌ నుంచి మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఓటమి చెందారు. ఒమర్‌ అబ్దుల్లా సమీప స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్‌ రషీద్‌పై 2,04,142 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. మెహబూబా ముఫ్తీ తన సమీప నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ అభ్యర్థి అల్తాఫ్‌ అహ్మద్‌పై 2,81,794 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు.అనేక మంది మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడిఎస్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణ కర్ణాటకలోని హసన్‌ లోక్‌సభ స్థానంలో ఓటమి చెందారు. ప్రజ్వల్‌ రేవణ్ణ (6,30,339)పై కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రేయాస్‌ ఎం. పటేల్‌ (6,72,988) 42,649 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బిజెపి అభ్యర్థులైన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌ పూర్‌లో మేనకా గాంధీ, తమిళనాడులోని చెనై సౌత్‌లో తమిళసై సౌందరరాజన్‌, తమిళనాడులోని కొయంబత్తూర్‌ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓటమి చవి చూశారు.

➡️