ఢిల్లీలో 400కి చేరిన వాయు నాణ్యతా ప్రమాణం

న్యూఢిల్లీ :    ఢిల్లీలో గాలి కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. దీంతో ప్రజలు శ్వాస పీల్చేందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం మరోసారి వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) 400కి చేరుకుంది. పెరుగుతున్న చలితో, ఉష్ణోగ్రతలతో నిరంతర ఎక్యూఐలో క్షీణత కనిపిస్తుంది. దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. మరో మూడు రోజుల పాటు ప్రమాదకర పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది.

సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ప్రకారం.. ఢిల్లీలో 24 గంటల సగటు ఎక్యూఐ శనివారం 401 కి చేరుకుంది. ఇది ‘డేంజర్‌’ జోన్‌లో ఉంది. సాయంత్రం 4 గంటలకు, ఎక్యూఐ ‘చాలా పేలవమైన’ స్థాయికి చేరుకుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు 382 (వెరీ పూర్‌), గురువారం 358 (వెరీ పూర్‌) గా ఉంది. నూతన సంవత్సర వేడుకల్లో బాణా సంచా పేల్చడంతో 400 దాటే ప్రమాదం ఉందని వాతావారణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. గత రెండు రోజులుగా నగరంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడమే గాలి నాణ్యత లోపానికి కారణమని అన్నారు. డిసెంబరు 31 నుండి జనవరి 2 వరకు ఢిల్లీలోని గాలి నాణ్యత ‘వెరీ పూర్‌’ కేటగిరీలోనే ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ‘ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌’ పేర్కొంది.

గత ఐదు రోజులుగా ఢిల్లీని చుట్టుముట్టిన దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు సేవలు ఆలస్యమయ్యాయి. నగరంలో శనివారం తీవ్రమైన పొగమంచు నమోదైంది. శనివారం సఫ్దర్‌జంగ్‌లో 200 మీటర్ల వద్ద అత్యల్ప  దృశ్యమాన్యత (విజిబిలిటీ ) నమోదైందని, పాలెం వద్ద మరింత   500 మీటర్ల కంటే తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

➡️