విజేత ఎవరైనా ఓడేది ప్రజాస్వామ్యమే

  •  భారత్‌లో పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం వ్యాఖ్య
  •  మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని ఆందోళన
  •  విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని ఆగ్రహం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మన దేశాన్ని ‘విశ్వ గురు’ అని అంటారు. విశ్వ గురు అంటే ప్రపంచ నేత అని అర్థం. అయితే ప్రపంచ దేశాలు భారత్‌ను అలా చూస్తున్నాయా? లేదనే చెప్పాలి. పలు అంతర్జాతీయ సమాజాలు, హక్కుల సంఘాలు మన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను తూర్పార పడుతున్నాయి. హిందూత్వ శక్తులు పెట్రేగిపోవడాన్ని వేలెత్తి చూపుతున్నాయి. ఐక్యరాజ్యసమితి నిపుణులు, పౌర సమాజ గ్రూపుల నుండి అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల పార్లమెంటేరియన్ల వరకూ భారత ప్రజాస్వామ్యం పనితీరును ఎండగట్టారు. గత నెల 16 నుండి 30వ తేదీ వరకూ ఆయా సంస్థలు, నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు….

సిఎన్‌ఎన్‌, అమెరికా
మోడీ పరిపాలనలో మతపరమైన విభజనలు చోటుచేసుకుంటున్నాయి. మతోన్మాదం ప్రబలుతోంది. హిందూ జాతీయతావాదాన్ని ముందుకు తీసుకుపోవడానికే మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. విధానపరమైన వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి దీనిని ఎంచుకున్నారు.

ఎన్‌పిఆర్‌, అమెరికా
అయోధ్యపై 2019లో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం చూపిన ప్రభావాన్ని ఈ పత్రిక వివరించింది. దాని ప్రకారం… అయోధ్య తీర్పు నుండి ప్రేరణ పొందిన మధురలోని హిందూ జాతీయతావాదులు అక్కడి మందిరం, మసీదు వివాదానికి సంబంధించిన దశాబ్దాల నాటి ఒప్పందానికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ది గార్డియన్‌, బ్రిటన్‌
సార్వత్రిక ఎన్నికలపై ఈ పత్రిక ఏప్రిల్‌ 24న తన సంపాదకీయంలో ఇలా రాసింది…. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నికల్లో విజేత ఎవరైనా ఓడేది మాత్రం భారత ప్రజాస్వామ్యమే. ప్రతిపక్ష నేతలను అరెస్ట్‌ చేయడం, పార్టీ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేయడం వంటివి బలహీనమైన ప్రజాస్వామ్యానికి సంకేతాలుగా పత్రిక విమర్శించింది. అలాగే, రాజస్థాన్‌లో గత నెల 21న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ముస్లిం వ్యతిరేక విద్వేష ప్రసంగాన్ని ఈ పత్రిక ప్రస్తావించింది. ముస్లింలను చొరబాటుదారులుగా, అధిక సంతానం కలిగిన వారిగా ప్రధాని పేర్కొనడాన్ని తప్పుపట్టింది.

ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌, కెనడా
పది సంవత్సరాల మోడీ పాలనలో భారత్‌ మారిపోయింది. హిందూ జాతీయతావాదులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. తద్వారా సామాజిక మాధ్యమాలపై ఓ కొత్త నైతిక కోడ్‌ను విధించారు. అది భారత్‌లోని రోజువారీ సమాజ జీవితాన్ని బెదిరిస్తోంది.

ది న్యూయార్క్‌ టైమ్స్‌, అమెరికా
అయోధ్యలో రామమందిర నిర్మాణం భారత్‌ను హిందూ దేశంగా మార్చింది. అసమానతలు, ఉద్యోగావకాశాలు లేకపోవడం, ప్రజారోగ్యానికి విఘాతం కలగడం, వాతావరణ మార్పుల విధ్వంసం వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదు. దీనివల్ల ప్రపంచంలో భిన్నత్వం కలిగిన దేశాల్లో ఒకటైన భారత్‌ భయాందోళనలతో నిండిన దేశంగా మారింది.

పిబిఎస్‌, అమెరికా
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి కూడా పరీక్ష ఎదురవుతోంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా జరుగుతాయా అనే దానిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మీడియా సంస్థలతో పాటు పలువురు పార్లమెంటేరియన్లు, విదేశీ పాత్రికేయులు, నిపుణులు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, అమెరికా విదేశాంగ శాఖ, ఇండియన్‌ డయాస్పొరా గ్రూపులు, కౌన్సిల్‌ ఆన్‌ అమెరికన్‌-ఇస్లామిక్‌ రిలేషన్స్‌, ది ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌ వంటి సంస్థలు కూడా దేశంలో క్షీణిస్తున్న ప్రజాస్వామ్య విలువలపై ఆందోళన వ్యక్తం చేశాయి.

➡️