దట్టమైన పొగమంచుతో రిపబ్లిక్‌ వేడుకలపై ప్రభావం : ఐఎండి

న్యూఢిల్లీ :   దట్టమైన పొగమంచు, తక్కువ విజిబిలిటీ (దృశ్యమాన్యత) 75వ రిపబ్లిక్‌ వేడుకలపై ప్రభావం చూపవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) గురువారం తెలిపింది. పొగమంచు కారణంగా శుక్రవారం ఉదయం 8.30 గంటలకు విజిబిలిటీ 400 మీటర్లు ఉంటుందని పేర్కొంది. పది గంటలకు 1,500 మీటర్లు మెరుగుపడే అవకాశం ఉందని తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుండి 7 డిగ్రీలకు పడిపోయాయని ప్రకటించింది.

మధ్యధరా ప్రాంతం నుండి వచ్చే పాశ్చాత్య అవాంతరాలు (డబ్ల్యుడి)తో వాయువ్య భారతదేశంలో అకాల వర్షాలు పడే అవకాశం ఉంటుందని, దట్టమైన పొగమంచు వ్యాపించిందని పేర్కొంది. సాధారణంగా డిసెంబర్‌, జనవరి నెలల్లో ఐదు నుండి ఏడు డబ్ల్యుడిలు దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయని, అయితే ఈ ఏడాది ఈ ప్రాంతంపై డబ్ల్యుడిల ప్రభావం అంతగా లేదని తెలిపింది. ఇప్పటివరకు రెండు డబ్ల్యుడిలు ప్రభావితం చేశాయని.. అయితే వాటి ప్రభావం గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర, తూర్పు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లకే పరిమితమైందని వెల్లడించింది. బలహీనమైన తక్కువ స్థాయి గాలులు, తేమ, శీతలీకరణ పరిస్థితులు దట్టమైన పొగమంచుకు కారణమౌతాయని పేర్కొంది. డబ్ల్యుడిలతో ఏర్పడే బలమైన గాలులు, అవక్షేపణం పొగమంచు ఏర్పడకుండా అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎలినినో పరిస్థితులు, మధ్య పసిఫిక్‌ సముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడంతో డబ్లుడిలు ప్రభావవంతంగా ఉండకపోవడానికి కారణమని పేర్కొంది.

➡️