నేపాల్‌ డిప్యూటీ ప్రధాని రాజీనామా

May 14,2024 09:24

ప్రభుత్వం నుండి బయటకు వచ్చిన మరో మంత్రి
ఖాట్మండు : నేపాల్‌ డిప్యూటీ ప్రధాని, మధేషి సీనియర్‌ నేత ఉపేంద్ర యాదవ్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. ఇది ప్రచండ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరోగ్యమంత్రిగా కూడా వున్న యాదవ్‌ తన రాజీనామా లేఖను ప్రచండకు అందచేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాదవ్‌తోపాటూ అదే పార్టీకి అటవీ శాఖ సహాయ మంత్రి దీపక్‌ కర్కి కూడా రాజీనామా చేశారు. యాదవ్‌ చైర్మన్‌గా వున్న జనతా సమాజ్‌వాదీ పార్టీ నేపాల్‌ (జెఎస్‌పి-నేపాల్‌) రెండు గ్రూపులుగా విడిపోయి సీనియర్‌ నేత అశోక్‌ రారు జనతా సమాజ్‌వాదీ పార్టీ అనే పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన వారం రోజుల తర్వాత యాదవ్‌ రాజీనామా వెలువడింది. కొత్త పార్టీని ఎన్నికల కమిషన్‌ కూడా గుర్తించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకారాన్ని కొనసాగించడం సాధ్యం కాదని యాదవ్‌ వ్యాఖ్యానించారు. జెఎస్‌పి-నేపాల్‌కు మొత్తంగా 12మంది సభ్యులున్నారు. చీలిక అనంతరం ఆ పార్టీ బలం 5కి పడిపోయింది. అయినా ప్రధాని ప్రచండ నేతృత్వంలోని పాలక సంకీర్ణానికి మెజారిటీ వుంది. తాజా పరిణామాలు తక్షణమే ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపకపోయినా దీర్ఘకాలంలో ప్రభుత్వ సుస్థిరతపై తీవ్ర పర్యవసానాలు చూపగలవని మాజీ పర్యావరణ మంత్రి సునీల్‌ మనందార్‌ వ్యాఖ్యానించారు.

➡️