పోలీసులకు లొంగిపో.. లేకపోతే నా ఆగ్రహానికి గురవుతావు : ప్రజ్వల్‌కి దేవెగౌడ హెచ్చరిక

May 23,2024 18:34 #Deve Gowda, #Prajwal Revanna, #warning

బెంగళూరు : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ.. జర్మనీకి పారిపోయిన తన మనవడు, హసన్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణకి మాజీ ప్రధాని దేవెగౌడ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. ఎక్కడున్నాసరే ప్రజ్వల్‌ భారత్‌కి తిరిగి రావాలని, పోలీసుల ఎదుట లొంగిపోవాలని, లేదంటే తన ఆగ్రహానికి గురవ్వక తప్పదంటూ దేవెగౌడ హెచ్చరించాడు. ఈమేరకు ‘ప్రజ్వల్‌ రేవణ్ణకు ఇదే నా హెచ్చరిక’ అంటూ ఆయన ఓ లేఖను కూడా సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ‘నేను పూజ కోసం 18వ తేదీన ఆలయానికి వెళ్లినప్పుడు ప్రజ్వల్‌ గురించి మీడియాతో మాట్లాడాను. అతను నాకు, నా కుటుంబానికి, నా స్నేహితులకు, పార్టీ కార్యకర్తలకు షాక్‌ ఇచ్చాడు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చట్టపరంగా అతనికి శిక్షపడాలని నేను, హెచ్‌డి కుమారస్వామి బహిరంగ లేఖ ద్వారా చెప్పాము. ఈ సమయంలో నేను ఒక్కటే చేయగలను. ప్రజ్వల్‌కి గట్టి వార్నింగ్‌ ఇస్తాను. అతను ఎక్కడున్నా తిరిగి భారత్‌కి వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలి. అతను చట్టపరమైన ప్రక్రియను లోబడి ఉండాలి. నేను అప్పీల్‌ చేయడం లేదు. వార్నింగ్‌ ఇస్తున్నాను. నా మాట వినకపోతే.. నాతోపాటు కుటుంబ సభ్యులందరి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. నాపై గౌరవం ఉంటే వెంటనే తిరిగి రావాలి.’ అని దేవెగౌడ తన లేఖలో పేర్కొన్నారు.

కర్ణాటకలో హసన్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రజ్వల్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఈ నియోజకవర్గానికి పోలింగ్‌ ముగిసిన మరుసటిరోజు ఏప్రిల్‌ 27న లైంగిక ఆరోపణలు ఎదురవ్వడంతో ప్రజ్వల్‌ జర్మనీకి పారిపోయిన సంగతి తెలిసిందే. ఇక కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేటాయించింది.

➡️