కేంద్ర ప్రభుత్వ విధానాలపై జులై 10న దేశవ్యాపితంగా ధర్నాలు

  • సిఐటియు ఆలిండియా కమిటీ పిలుపు

న్యూఢిల్లీ : కార్మిక హక్కులను కాలరాసే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, అగ్నివీర్‌ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని తదితర డిమాండ్ల సాధనకు జులై10న దేశవ్యాపితంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని సిఐటియు ఆలిండియా కమిటీ బుధవారం పిలుపునిచ్చింది. ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వ తిరోగమన, నయా ఉదారవాద విధానాల డైరక్షన్‌లో ఎలాంటి మార్పు వుంటుందని భావించలేమని పేర్కొంది. పద్దెనిమిదవ లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించడంలో బిజెపి విఫలమైన నేపథ్యంలో దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై సిఐటియు కేంద్ర కార్యదర్శివర్గం ఈ నెల 17, 18 తేదీల్లో న్యూఢిల్లీలో సమావేశమై చర్చించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పని పరిస్థితులు, పెన్షన్లు వంటి జీవనోపాధి అంశాలపై గత పదేళ్ల బిజెపి పాలనలో కార్మిక వర్గం నిరంతరంగా సాగించిన పోరాటాలు, ప్రచారాలు ఈ ఎన్నికల ప్రచారంలో కొంతమేరకు దోహదపడ్డాయని సిఐటియు కార్యదర్శివర్గం పేర్కొంది. కార్మిక చట్టాల అమలును నోటిఫై చేస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనలో, కార్మికుల ఇపిఎఫ్‌ బకాయిలను చెల్లించడంలో యజమానులు విఫలమైతే వారికి విధించే జరిమానాలను గణనీయంగా తగ్గించడంలో, నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి) పేరుతో ప్రైవేటీకరణను ఉధృతం చేస్తోందని పేర్కొంది. ప్రజలను సమాయత్తం చేసి, ఈ విధానాలపై దాడికి వ్యతిరేకంగా గట్టి ప్రతిఘటనను నిర్మించడానికి తక్షణమే ప్రచారాన్ని చేపట్టాలని సిఐటియు కార్యదర్శివర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది. కిందిస్థాయి నుండి ప్రచారాలు, ప్రజా సమీకరణ చేపట్టేందుకు దశలవారీ కార్యాచరణలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జులై 10న తహసిల్‌, జిల్లాస్థాయిల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ఎన్‌ఎంపిని రద్దు చేసి ఇతర ప్రైవేటీకరణ చర్యలన్నింటినీ నిలుపుచేయాలని, కార్మికులందరికీ నెలకు రూ.26వేలకు తగ్గకుండా కనీస వేతనం నిర్ణయించాలని, కాంట్రాక్టర్‌ మారినా కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించకుండా కాంట్రాక్ట్‌ వర్కర్లకు ఉపాధి భద్రతకు హామీ కల్పించాలని, ఒకే తరహా ఉద్యోగాలు చేస్తున్న వారందరికీ వారు కాంట్రాక్ట్‌ వారైనా, శాశ్వత ఉద్యోగులైనా సరే అందరికీ సమాన వేతనాలు, ప్రయోజనాలు కల్పించాలని, అగ్నివీర్‌, ఆయుధవీర్‌, కొయలావీర్‌, ఇతర నిర్దిష్ట కాలపరిమితి గల ఉపాధులను రద్దు చేయాలని సిఐటియు డిమాండ్‌ చేసింది. కొత్త పెన్షన్‌ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరించాలని కోరింది. ఇపిఎస్‌ పెన్షన్‌దారులకు రూ.9వేలు ఆ పైన కనీస పెన్షన్‌వచ్చేలా చూడాలని కోరింది. స్కీమ్‌ వర్కర్లను గుర్తించాలని, ఇతరులతో సమానంగా వారికి కనీస వేతనాలు, సామాజిక భద్రతా ప్రయోజనాలు, పెన్షన్‌ వంటి సదుపాయాలను కల్పించాలని కోరింది. స్థానికంగా వున్న డిమాండ్లు కూడా అవసరమైతే ఈ డిమాండ్ల పత్రంలో చేరుస్తామని పేర్కొంది. జులై 10న కోర్కెల దినంగా అఖిల భారత అంగన్‌వాడీ కార్మికులు, హెల్పర్ల సమాఖ్య (ఎఐఎఫ్‌ఎడబ్ల్యుఎహెచ్‌) పాటించనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సిఐటియ కార్మిక లోకానికి విజ్ఞప్తి చేసింది.

➡️