25,753 మంది టీచర్ల తొలగింపు

Apr 22,2024 23:43 #high court, #Kolkata
  •  బెంగాల్‌లో 2016 ఎస్‌ఎల్‌ఎస్‌టి రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ రద్దు చేసిన కోల్‌కత్తా హైకోర్టు
  •  సుప్రీంకోర్టుకు వెళ్తాం : మమతా బెనర్జీ

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రస్థాయి నియామక పరీక్ష (ఎస్‌ఎల్‌ఎస్‌టి) 2016 ద్వారా నియమించబడిన 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ కోల్‌కత్తా హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించిన ఈ పరీక్ష ప్రక్రియ చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని హైకోర్టు ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియపై సిబిఐ విచారణకు జస్టిస్‌ దేవంగ్షు బసక్‌, జస్టిస్‌ మహ్మద్‌ షబ్బార్‌ రషీదిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ డివిజన్‌ బెంచ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 350 పిటిషన్లు, అప్పీళ్లను ఈ బెంచ్‌ విచారించింది. మార్చి 20నే విచారణను ముగించిన బెంచ్‌ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. సోమవారం 282 పేజీల తీర్పును వెల్లడించింది.
2016 ఎస్‌ఎల్‌ఎస్‌టి ద్వారా జరిపిన అన్ని నియామకాలను రద్దు చేసిన ధర్మాసనం అధికారిక రిక్రూట్‌మెంట్‌ తేదీ ముగిసిన తరువాత నియమించబడినవారు, ఖాళీ ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నిషన్‌ (ఒఎంఆర్‌) షీట్లను సమర్పించి అపాయింట్‌మెంట్‌ పొందిన వారు అప్పటి నుంచి ఇప్పటి వరకూ పొందిన అన్ని వేతనాలు, ప్రయోజనాలను 12 శాతం ఏడాది వడ్డీతో నాలుగు వారాల్లో తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అన్ని నియామకాలను రద్దు చేయడంపై కోర్టు స్పందిస్తూ ‘వేరే ఇతర మార్గం లేకనే’ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. హైకోర్టు తీర్పు చట్టవిరుద్దమని, సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని, వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి) చైర్మన్‌ సిద్దార్థ్‌ మజుందార్‌ తీర్పుపై స్పందిస్తూ హైకోర్టు ఆదేశాలను పూర్తిగా పరిశీలించిన తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఎస్‌ఎల్‌ఎస్‌టి 2016 ద్వారా 24,640 ఉద్యోగాలను భర్తీ చేశారు. సుమారు 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 24,640 ఖాళీల కోసం 25,753 అపాయింట్‌మెంట్‌ లెటర్లు జారీ చేసినట్లు పిటిషన్‌దార్లు పేర్కొన్నారు.

➡️