బిజెపికి భంగపాటు

Jun 5,2024 07:40
  • కూటమి గెలిచినా సొంతంగా మెజార్టీ కోల్పోయింది
  • యుపిలో గట్టి ఎదురుదెబ్బ

తెలుగునాట సీట్లు పెరగడం ప్రమాదానికి సంకేతంపద్దెనిమిదో లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మోడీ, బిజెపిలకు దిమ్మ తిరిగే తీర్పునిచ్చారు. ఈసారి 400 సీట్లు దాటుతాం అని ప్రగల్భాలు పలికిన మతతత్వ నిరంకుశ మోడీ అండ్‌ కోకు భారత ఓటర్లు కీలెరిగి వాత పెట్టారు. ఉన్న మెజార్టీని కూడా ఊడబెరికి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రుల మద్దతు కోసం వెంపర్లాడేలా చేశారు..బిజెపికి గుండెకాయ లాంటి హిందీ బెల్టులో అందునా 80 స్థానాలతో అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న యుపిలో ఆ పార్టీకి కోలుకోలేని గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాముడి పేరుతో బిజెపి ఆడుతున్న రాజకీయాన్ని అయోధ్య ప్రజలు ఛీత్కరించారు. దక్షిణాదిలో కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి బలం పెంచుకోవడం, ఒడిషా అసెంబ్లీలో మొన్నటివరకు మిత్రపక్షంగా ఉన్న బిజెడిని అణగదొక్కి అక్కడ అధికారం చేజిక్కించుకోవడం ఒకింత ఆందోళన కలిగించే పరిణామం. నిరుద్యోగం, అధిక ధరలు, అవినీతి, దిగజారు తున్న జీవన ప్రమాణాలు వంటి ప్రజా సమస్యలను గాలికొదిలేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడం,ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం, ప్రజాస్వామ్యంపైన, రాజ్యాంగం పైన ఎడాపెడా దాడి చేయడం వంటి మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలపై ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకతను ఈ తీర్పు ప్రతిబింబించింది. గత లోక్‌సభలో సొంతంగా 303 స్థానాలు కలిగిన బిజెపి ఈ సారి 241 వద్దే ఆగిపోయింది. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కూడా చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా 292 సీట్ల మార్కుకు చేరింది. 2019లో ఎన్డీయే కూటమికి 353 సీట్లు లభించాయి. గత సారితో పోల్చితే ఎన్‌డిఎ సీట్ల సంఖ్య, ఓట్ల శాతం రెండు తగ్గాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అన్న నినాదంతో ముందుకొచ్చిన ‘ఇండియా బ్లాక్‌’ మంచి ఫలితాలనే సాధించింది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వామపక్షాల బలం గత సారి కన్నా స్వల్పంగా మెరుగుపడింది. మొత్తం మీద ఈ తీర్పు మతోన్మాద, నిరంకుశ పార్టీలకు ఒక హెచ్చరిక.

➡️