DMK : డిఎంకె, కాంగ్రెస్ లపై మండిపడిన మోడీ

Mar 15,2024 15:37 #DMK, #Tamil Nadu

కన్యాకుమారి : ఈ దేశాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని డిఎంకె ద్వేషిస్తోంది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం కన్యాకుమారిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘తమిళనాడు భవిష్యత్తుకు, సంస్కృతికి డిఎంకె శత్రువు. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట వేడుక ప్రసారాన్ని డిఎంకె నిలిపివేయాలని ప్రయత్నించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని మందలించాల్సి వచ్చింది. కొత్త పార్లమెంటులో సెంగోల్‌ను ఏర్పాటు చేయడం కూడా వారికి ఇష్టం లేదు. అయితే వివాదాస్పదమైన జల్లికట్టుకు మార్గం సుగమం చేసింది మన ప్రభుత్వమే.’ అని ఆయన అన్నారు.
ఇక ఈ సందర్భంగా మోడీ డిఎంకె, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేశారు. ‘ప్రజలకు చూపించడానికి బిజెపికి అభివృద్ధి కార్యక్రమాలుంటే.. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు స్కామ్‌లు ఉన్నాయి’ అని మోడీ ఎద్దేవా చేశారు. డిఎంకె, కాంగ్రెస్‌ పార్టీలు మహిళా వ్యతిరేకులు. అవి మహిళలను మోసం చేసి అవమానించాయి. మాజీ సిఎం జయలలితో డిఎంకె వర్కర్లు ఎలా ప్రవర్తించారో తమిళనాడు ప్రజలకు తెలుసు అని ఆయన అన్నారు. కన్యాకుమారిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టినట్లు మోడీ చెప్పారు. గత పది సంవత్సరాలలో తమిళనాడులో సుమారు 50 వేల కోట్ల విలువైన హైవే ప్రాజెక్టుల్ని కేంద్రం పూర్తి చేసింది. మరో 70 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి అని మోడీ అన్నాడు.

➡️