21 స్థానాల్లో డిఎంకె పోటీ

Mar 19,2024 00:50 #21 seats, #contesting, #DMK
  • తమిళనాట ‘ఇండియా’ ఫోరం సీట్లు ఖరారు

చెన్నై : తమిళనాడులోని అధికార డిఎంకె, మిత్రపక్షాలైన కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలతో లోక్‌సభ సీట్ల సర్దుబాటు పూర్తయింది. డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌, తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కె.సెల్వపెరుంతగై చెన్నైలోని డిఎంకె ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 40 లోక్‌సభ స్థానాలకుగాను 21 స్థానాల్లో డిఎంకె పోటీ చేస్తుంది. తమిళనాడులో తొమ్మిది లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలో ఉన్న ఒక్క స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించింది. సిపిఎం, సిపిఐ, విసికె పార్టీలు రెండేసి స్థానాల్లో పోటీ చేస్తాయి. మధురై నుంచి సిట్టింగ్‌ ఎంపి ఎస్‌ వెంకటేశన్‌ను, దిండిగల్‌ నుంచి ఆర్‌. సచిదానందంను అభ్యర్థులుగా సిపిఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వైకో నేతృత్వంలోని మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండిఎంకె)కు తిరుచిరాపల్లి నియోజకవర్గాన్ని, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయుఎంఎల్‌)కు రామనాథపురం స్థానాన్ని డిఎంకె కేటాయించింది.
చెన్నై నార్త్‌, చెన్నై సౌత్‌, చెన్నై సెంట్రల్‌, శ్రీపెరంబుదూర్‌, అరక్కోణం, కాంచీపురం (ఎస్‌సి), తిరువణ్ణామలై, వెల్లూరు, ధర్మపురి, కళ్లకురిచి, సేలం, పొల్లాచ్చి, నీలగిరి (ఎస్‌సి), కోయంబత్తూరు, తేని, అరణి, పెరంబలూరు, ఈరోడ్‌, తంజావూరు, తెన్కాసి (ఎస్‌సి), తూత్తుకుడి లోక్‌సభ స్థానాల్లో డిఎంకె పోటీ చేయనున్నది.
తిరువళ్లూరు (ఎస్‌సి), కృష్ణగిరి, కరూర్‌, కడలూరు, మయిలాడుతురై, శివగంగ, విరుదునగర్‌, కన్యాకుమారి, తిరునెల్వేలి, పుదుచ్చేరి స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయనున్నది. విడుతలై చిరుతైగల్‌ కట్చి (విసికె) పార్టీకి చిదంబరం (ఎస్‌సి), విల్లుపురం (ఎస్‌సి) స్థానాలు, సిపిఎంకు మధురై, దిండిగల్‌ సీట్లు, సిపిఐకు తిరుపూర్‌, నాగపట్నం (ఎస్‌సి) స్థానాలు ఖరారయ్యాయి. తిరుచిరాపల్లి సీటు నుంచి ఎండిఎంకె, నమక్కల్‌ స్థానం నుంచి కొంగునాడు మక్కల్‌ దేశీయ కచ్‌ (కెఎండికె), రామనాథపురం నుంచి ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయుఎంఎల్‌) పోటీ చేయనున్నాయి. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌కు చెందిన మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ డిఎంకె నేతృత్వంలోని కూటమికి మద్దతు ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

➡️