ఆధార్‌పై పుకార్లు నమ్మొద్దు

May 26,2024 23:06 #Aadhaar, #update
  • జూన్‌ 14 గడువు ఉచిత అప్‌డేట్‌ కోసమే

న్యూఢిల్లీ : ఈ ఏడాది జూన్‌ 14వ తేదీలోగా వ్యక్తిగత వివరాలను అప్‌డేట్‌ చేసుకోకపోతే ఆ తర్వాత నుంచి ఆధార్‌ పని చేయదంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (ఉడారు) కొట్టిపారేసింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్‌లో వ్యక్తిగత వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువు వచ్చే జూన్‌ 14 అని తెలిపింది. అప్పటిలోగా ఆధార్‌ వినియోగదారులు తమ వివరాలను ఉచితంగానే అప్‌డేట్‌ చేసుకోవచ్చునని, అంతేకాని ఆధార్‌ పనిచేయకపోవడం అంటూ ఉండదని స్పష్టం చేసింది. గడువులోగా అప్‌డేట్‌ చేసుకోకపోతే తగిన రుసుము చెల్లించి వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సివుంటుందని ఉడారు తెలిపింది.
ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకునేందుకు ఉడారు తొలుత 2023 డిసెంబర్‌ 14 వరకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఈ గడువును రెండుసార్లు జూన్‌ 14 వరకు పొడిగిస్తూవచ్చింది. ఆన్‌లైన్‌లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చుని ఉడారు పేర్కొంది. ఆధార్‌ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయినవారు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడారు గతంలో సూచించిన సంగతి తెలిసిందే.

➡️