ఢిల్లీ మత ఘర్షణల కేసులో వ్యక్తిగతంగా హాజరవ్వండి

Dec 7,2023 09:38 #Delhi, #Riots
delhi riots

ఇడి ప్రత్యేక డైరెక్టర్‌కు ఢిల్లీ కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో 2020లో చోటుచేసుకున్న మత ఘర్షణలకు సంబంధించిన కేసులో ఈ నెల 8న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ప్రత్యేక డైరెక్టర్‌కు ఢిల్లీ అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును ఇడి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం కోర్టుకు విచారణకు ప్రాసిక్యూషన్‌ లాయర్లు హాజరు కాకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు దాదాపు 30 నిమిషాల పాటు వేచి చూసినా. ప్రాసిక్యూషన్‌ తరపున ఎవ్వరూ హాజరు కాలేదని అదనపు సెషన్స్‌ జడ్జి అమితాబ్‌ రావత్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ‘ఈ పరిస్థితుల్లో ఇడి స్పెషల్‌ డైరెక్టర్‌ తదుపరి విచారణ తేదీ అంటే డిసెంబర్‌ 8 మధ్నాహ్నాం 2 గంటలకు వ్యక్తిగతంగా హాజరుకావాలి’ అని జడ్జి ఆదేశించారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మత విద్వేషంతో రగిలిపోయిన కాషాయ మూకలు స్థానిక ప్రజలపైనా, విశ్వవిద్యాలయాల్లోకి చొరబడి విద్యార్థులపైనా దాడులు సాగించాయి. అయితే శాంతియుత నిరసనలకు హింసను అంటగట్టి మైనార్టీలపై మరింత విద్వేషాన్ని రాజేంసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పెద్దలు కుయుక్తులు పన్నారని సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇడిని రంగంలోకి దింపిన కేంద్ర ప్రభుత్వం మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని దాడులను చేయించిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ఘర్షణలకు ఆజ్యం పోయడానికి డమ్మీ కంపెనీలను ఉపయోగించి అనేక కోట్ల రూపాయలను ఆప్‌ మాజీ కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇడి విచారణ చేస్తోంది. ఈ కేసుపై కోర్టులో విచారణ జరగగా..ఇడి తరుపునే ప్రాసిక్యూషన్‌ న్యాయవాదులు గైర్హాజరవ్వడం గమనార్హం.

➡️