ఆప్‌ నేత దుర్గేశ్‌ పాథక్‌కి ఇడి సమన్లు .. అతిషీ వ్యాఖ్యలు నిజమయ్యాయా..!

న్యూఢిల్లీ :     ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అసిస్టెంట్‌, ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాథక్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) నోటీసులు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. లిక్కర్‌ స్కామ్‌కి సంబంధించి తనతో పాటు మరో నలుగురిని ఇడి అరెస్ట్‌ చేయవచ్చని ఢిల్లీ మంత్రి అతిషీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనతో పాటు సౌరభ్‌ భరద్వాజ్‌, దుర్గేశ్‌ పాథక్‌, రాజ్యసభ ఎంపి రాఘవ చద్దాలను అరెస్ట్‌ చేయవచ్చని పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపి రాఘవ చద్దా కంటి చికిత్స కోసం బ్రిటన్‌లో ఉన్నారు.

గత నెల అరెస్టయిన కేజ్రీవాల్‌ విచారణలో  అతిషీ, భరద్వాజ్‌ల పేర్లు వెల్లడించారని ఇడి కోర్టుకు వెల్లడించింది.  తమ పేర్లు బయటికి వచ్చిన అనంతరం అతిషీ మీడియాతో మాట్లాడుతూ… ఆ వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాథక్‌కు నోటీసుల వచ్చాయి. ఆయన ప్రస్తుతం రాజీందర్‌ నగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే. కొన్ని పత్రాలకు సంబంధించి స్పష్టత కోసం ఆయనను విచారించనున్నట్లు సమాచారం.

2022 ఫిబ్రవరిలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో నగదు చెల్లింపుకు సంబంధించిన కొన్ని ప్రకటనల్లో పాథక్‌ పేరు కనిపించిందని పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ అధికారి తెలిపారు.
అయితే ఈ ఆరోపణలను గోవా ఆప్‌ అధ్యక్షుడు అమిత్‌ పాలేకర్‌ తోసిపుచ్చారు. తనతో పాటు స్థానిక యూనిటిక్‌ చెందిన నేతలు విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆ ఎన్నికల్లో 6.8 శాతం ఓట్ల వాటాతో పాటు రెండు స్థానాల్లో ఆప్‌ విజయం సాధించింది.

➡️