వారణాసి మినహా అన్నింటా బిజెపికి ఓటమే

May 22,2024 09:12 #akilesh, #speech

– యుపిలో ‘ఇండియా’ పవనాలు
– లాల్‌గంజ్‌ సభలో అఖిలేశ్‌ యాదవ్‌
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్షాల ఐక్య వేదిక ‘ఇండియా’ ఫోరం పవనాలు వీస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బరిలో నిలిచిన వారణాసి లోక్‌సభ స్థానం మినహా యుపిలోని అన్ని స్థానాల్లోనూ బిజెపి పరాభవం పాలౌతుందన్నారు. ‘ఇండియా’ ఫోరం అభ్యర్థులకు మద్దతుగా లాల్‌గంజ్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఈసారి ఎలాంటి వ్యూహాలతో వచ్చినా యుపి ప్రజలు బిజెపిని తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని అఖిలేశ్‌ అన్నారు. వారణాసి నియోజకవర్గాన్ని క్యోటో నగరంగా పేర్కొన్న ఆయన.. బిజెపి ఒకే ఒక్క సీటులో మాత్రమే గెలుస్తుందని.. అది కూడా క్యోటోలోనే అని అన్నారు. మిగతా అన్ని సీట్లలోనూ ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. వారణాసిని జపాన్‌లోని క్యోటో నగరంగా అభివఅద్ధి చేస్తానంటూ ప్రధాని నరేంద్ర మోడీ గతంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో సెటైరికల్‌గా ఆ పేరును అఖిలేశ్‌ ప్రస్తావించడం విశేషం. ఎన్నికలు మొదలైనప్పుడు బిజెపి 400 సీట్లు దాటుతాయంటూ నినదించిందని.. ఇప్పుడేమో ప్రజలు 400 సీట్లలో ఓడిస్తామంటున్నారని ఆయన అన్నారు. ఈసారి 140 కోట్ల మంది ప్రజలు బిజెపికి 140 సీట్లు కూడా ఇవ్వరని చెప్పారు. బిజెపి ఇచ్చిన ప్రతి హామీ బూటకమేనంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలేశ్‌ సభావేదిక వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పెద్దసంఖ్యలో జనం దూసుకురావడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సివచ్చింది. ‘ఇండియా’ ఫోరానికి విశేష ఆదరణ లభిస్తోందనడానికి ఫోరం సభలకు పోటెత్తుతన్న అశేష జనవాహిని నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.

➡️