రైతుల గొంతు నొక్కుతోంది.. మోడీది నిరంకుశ ప్రభుత్వం : ‘ఢిల్లీ చలో’ ఆందోళనపై ఖర్గే

Feb 14,2024 09:45

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నిరంకుశ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల గొంతు నొక్కుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గత పది సంవత్సరాలుగా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనందునే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. డిమాండ్ల సాధన కోసం ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని చేపట్టిన రైతులపై పోలీసుల దాష్టీకాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ‘రైతులను రాజధానిలో అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు ముళ్ల కంచెలు వేశారు. డ్రోన్ల నుండి భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. తుపాకులు ఎక్కుపెడుతున్నారని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మూడు హామీలను తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. ‘2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నారు. స్వామినాధన్‌ సిఫార్సులకనుగుణంగా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తామన్నారు. ఆ కమిషన్‌ చేసిన ఇతర సిఫారసులను అమలు చేస్తామన్నారు. వీటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఖర్గే ధ్వజమెత్తారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. రైతులపై బాష్ప వాయువు ప్రయోగం దుర్మార్గం : బి.వెంకట్‌న్యాయమైన రైతాంగ హక్కులకై పోరాడుతున్న రైతులపై మిలటరీ, బాష్ప వాయువులను ప్రయోగించడం దుర్మార్గపు చర్య అని ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విమర్శించారు. మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దులో రైతులు న్యాయపరమైన డిమాండ్‌ కోసం పోరాడుతున్నారని, వారిపై మిలటరీని పెట్టి వారిపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడాన్ని యావత్తు దేశం ఖండించాలని అన్నారు. మోడీ ప్రభుత్వం తక్షణమే రైతులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. రైతులకు బిజెపి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు జరపాలని కూడా డిమాండ్‌ చేశారు. రైతులు చలో ఢిల్లీకి ముందు 15 రోజుల క్రితమే మోడీకి లేఖ రాసినా, ఇప్పటి వరకు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి భరోసా రాలేదని అన్నారు. హరిత విప్లవ సృష్టికర్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించిందని, వ్యవసాయంలో ఆయన చేసిన ప్రతిపాదనలను అమలు చేయదా? అని ప్రశ్నించారు. ఈ నెల 16న జరిగే గ్రామీణ బంద్‌లో గ్రామీణ పేదలు, ఉపాధి హామీ కార్మికుల, పేదలు, కూలీలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేసి, కేంద్రానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

➡️