ఘోర ప్రమాదం – డంపర్‌ను ఢీకొట్టిన కారు : 8మంది సజీవదహనం

Dec 10,2023 09:00 #8, #accident, #Burned Alive, #Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌ : యుపిలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలి డంపర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి కారులో ఉన్న ఎనిమిదిమంది సజీవదహనమయ్యారు.

నిన్న రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని భోజిపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న నైనిటాల్‌ హైవేపై బరేలీ నుంచి బహేరీ వైపు వెళుతున్న ఎర్టిగా కారు టైరు పగిలి, డివైడర్‌ను దాటి అటువైపు నుంచి వస్తున్న డంపర్‌ను ఢీకొట్టింది. దీంతో ఈ రెండు వాహనాల్లో పేలుడు సంభవించి, మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఎనిమిదిమంది సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న ఎస్‌ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేసింది. వాహనాలను రోడ్డు మధ్య నుంచి తొలగించారు.

పెళ్లి ఊరేగింపు కోసం బహేరి నివాసి సుమిత్‌ గుప్తాకు చెందిన ఎర్టిగా కారును బహేరీకి చెందిన నారాయణ్‌ నాగ్లా నివాసి ఫుర్కాన్‌ బుక్‌ చేశారు. బహెరీలోని మొహల్లా జామ్‌లో నివాసం ఉంటున్న ఉవైస్‌ పెళ్లి ఊరేగింపు బరేలీలోని ఫహమ్‌ లాన్‌కు చేరుకుంది. ఈ పెళ్లి ఊరేగింపులో వాడటానికి ఈ కారును బుక్‌ చేసుకున్నారు. పెళ్లి ఊరేగింపు పూర్తయిన తర్వాత కొంతమంది పెళ్లివారు కారులో నిన్న రాత్రి 11.45 గంటలకు బహెరీకి తిరిగి బయలుదేరారు. భోజిపురా పోలీస్‌ స్టేషన్‌కు 1.25 కి.మీ దూరంలోని బహెరీ దిశలో ఉండగా, దబౌరా గ్రామ సమీపంలో కారు టైరు అకస్మాత్తుగా పగిలింది. దీంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి అటువైపు మళ్లి, ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొట్టింది. పెద్ద శబ్ధంతో కారులో మంటలు చెలరేగాయి. డంపర్‌ ఈ కారును దాదాపు 25 మీటర్ల మేరకు ఈడ్చుకెళ్లింది. డంపర్‌ ముందు భాగం కూడా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదాన్ని చూసిన డంపర్‌ డ్రైవర్‌, హెల్పర్‌ భయంతో వాహనం నుంచి దూకి పారిపోయారు. ఆ రోడ్డుపై ఇతర వాహనాల్లో వెళుతున్నవారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు అరగంట తరువాత అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఎస్‌ఎస్పీ ఘులే సుశీల్‌ చంద్రభాన్‌, సీఓ నవాబ్‌గంజ్‌ చమన్‌ సింగ్‌ చావ్డా, సీఎఫ్‌వో చంద్రమోహన్‌ శర్మ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఎనిమిదిమంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️