సిఎస్‌బి ఉద్యోగులకు ఎఫ్‌డిఐ కష్టాలు

Jan 6,2024 10:35 #csb, #kerala

వేతన పెంపునకు యాజమాన్యం నిరాకరణ

కొచ్చీ : కేరళలోని 100 ఏళ్ల నాటి అతి పురాతన బ్యాంక్‌ల్లో ఒక్కటైన సిఎస్‌బిలోని ఉద్యోగులు ఆందోళనకు గురైతున్నారు. ఈ బ్యాంక్‌లోకి ఎఫ్‌డిఐలు వచ్చిన తర్వాత ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. 704 శాఖలు కలిగిన సిఎస్‌బిలో 6,800 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సిఎస్‌బిలోకి ఎఫ్‌డిఐలు వచ్చిన తర్వాత మేనేజ్‌మెంట్‌ విధాన నిర్ణయాలు పూర్తిగా మారిపోయాయి. డిసెంబర్‌ తొలి వారంలో యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బియు), ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎ) 12వ ద్వైపాక్షిక సెటిల్‌మెంట్‌పై సంతకం చేశాయి. 180 రోజుల్లోగా తుది ఒప్పందం కుదుర్చుకోవడం బ్యాంకు ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ.. సిఎస్‌బి గతంలో క్యాథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌ ఉద్యోగులు ఇప్పటికీ 10వ బైపార్టీ సెటిల్‌మెంట్‌ ప్రకారమే వేతనాలు తీసుకుంటున్నారు. బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ 11వ ద్వైపాక్షిక సెటిల్‌మెంట్‌ను అమలు చేయడానికి నిరాకరించింది. 2018 తర్వాత కెనడా ఆధారిత ఫెయిర్‌ఫాక్స్‌ సిఎస్‌బిలో పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత వేతన సవరణను మేనేజ్‌మెంట్‌ నిరాకరించింది. మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని సిఎస్‌బి స్టాఫ్‌ ఫెడరేషన్‌ (సిఎస్‌బిఎస్‌ఎఫ్‌) తీవ్రంగా వ్యతిరేకించింది. నిర్ణీత వేతనాలతో మాత్రమే సిబ్బంది నియామకాలు చేపట్టడం, సామాజిక భద్రతా చర్యలు తీసుకోకపోవడం, మరీ ముఖ్యంగా ఉద్యోగం పోతుందనే భయాలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. విదేశీ పెట్టుబడులు వచ్చిన ఐదేళ్ల స్వల్ప వ్యవధిలో ఉద్యోగుల హక్కులపై స్పష్టమైన ప్రభావాన్ని చూపింది. ఉద్యోగుల నిరసనపై మేనేజ్‌మెంట్‌ పగతీర్చుకునే చర్యలకు పాల్పడుతుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సుదీర్గ పని గంటలకు తోడు సామాజిక సంక్షేమ చర్యలు లేకపోవడం సిబ్బందిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

➡️