ఎట్టకేలకు సిబిఐకి షాజహాన్‌ అప్పగింత

Mar 7,2024 08:58 #Sandeshkhali riots
Finally, Shah Jahan was handed over to the CBI

కోల్‌కతా : సందేశ్‌ఖలి దురాగతాల కేసులో నిందితుడు, టిఎంసి నాయకుడు షేక్‌ షాజహాన్‌ను పశ్చిమ బెంగాల్‌ పోలీసులు ఎట్టకేలకు బుధవారం సాయంత్రం సిబిఐ అధికారులకు అప్పగించారు. బుధవారం సాయంత్రం 4.15గంటల కల్లా ఎట్టి పరిస్థితుల్లో షాజహాన్‌ను, కేసు వివరాలను కోల్‌కత్తా హైకోర్టు డెడ్‌లైన్‌ విధించిన నేపథ్యంలో పోలీసులు అప్పగించకతప్పలేదు. దీంతో రెండు రోజులుగా బెంగాల్‌ ప్రభుత్వం, సిబిఐ మధ్య కొనసాగిన హైడ్రామాకు తెరపడినట్లయింది. వాస్తవానికి ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కలకత్తా హైకోర్టు మంగళవారమే సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే షాజహాన్‌ను మంగళవారం సాయంతం 4:30 గంటల్లోగా సిబిఐ కస్టడీకి అప్పగించాలని కూడా పశ్చిమ బెంగాల్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీనికి నిరాకరించిన మమతా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే తాము తక్షణమే దీనిపై విచారణ జరపలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దీంతో షాజహాన్‌ను అదుపులోకి తీసుకునేందుకు సిబిఐ అధికారులు కోల్‌కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా షాజహాన్‌ను అప్పగించేందుకు బెంగాల్‌ పోలీసులు నిరాకరించారు. దీంతో బుధవారం మరోసారి సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. పోలీసుల తీరును వివరించడంతో పాటు సీఐడీపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని కోరింది. సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి స్టే విధించకపోవడంతో బెంగాల్‌ పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు.. బుధవారం సాయంత్రం 4.15 గంటల కల్లా నిందితుడిని సిబిఐకి అప్పగించాల్సిందేనని ఆదేశించింది. దీంతో బుధవారం సాయంత్రం షాజహాన్‌తో పాటు కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ బెంగాల్‌ పోలీసులు సిబిఐకి అప్పగించారు.

➡️