భారత్‌జోడో న్యాయ్ యాత్రపై కేసు

గువహటి  :   కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదైంది. యాత్రతో పాటు నిర్వాహకులు కె.బి.బైజుపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు.  మణిపూర్‌లో ప్రారంభమైన ఈ యాత్ర గురువారం నాటికి అస్సోం చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా నిర్ణయించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో యాత్ర సాగిందని, దీంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని  పోలీసులు  పేర్కొన్నారు.

గురువారం న్యాయయాత్ర జోర్హాట్‌ పట్టణం చేరుకున్న అనంతరం కేటాయించిన మార్గం కె.బి. రోడ్‌లో వెళ్లకుండా మరో మార్గంలో వెళ్లారని అస్సోం పోలీసులు వెల్లడించారు. ఈ మార్పు తీవ్ర గందరగోళానికి దారితీసిందని అన్నారు. పెద్ద మొత్తంలో జనం చేరుకోవడంతో తొక్కిసలాట జరిగిందని,దీంతో కొందరు కింద పడిపోయారని చెప్పారు.  సుమోటోగా తీసుకున్న జోర్హాట్‌ సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ యాత్ర, ఆ  నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం నిబంధనలు పాటించకపోవడంతో పాటు రహదారి భద్రతా నియమాలను ఉల్లంఘించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

అయితే కాంగ్రెస్‌ నేతలు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. యాత్రకు అడ్డంకులు సఅష్టించే యత్నమని విమర్శించారు. తమకు కేటాయించిన మార్గం ఇరుకుగా ఉందని, ప్రజలు ఎక్కువమంది ఉండటంతో కొంతదూరం మరో మార్గంలో ప్రయాణించామని దేబబ్రత సైకియా పేర్కొన్నారు. మొదటిరోజు రాష్ట్రంలో యాత్ర విజయవంతంగా సాగడంతో ఆందోళన పడిన అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ .. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️