కొత్త క్రిమినల్‌ చట్టాల కింద వీధి వ్యాపారిపై తొలి కేసు

  • అమిత్‌షా బుకాయింపు

న్యూఢిల్లీ : మూడు క్రిమినల్‌ చట్టాలు అమలులోకి వచ్చిన కొద్దిసేపటికే ఢిల్లీలో ఓ వీధి వ్యాపారిపై తొలి కేసు నమోదయింది. దీనిపై సోషల్‌ మీడియాలో దుమారం రేగడంతో ఆ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేశారు. కొత్త చట్టం కింద తొలి కేసును వీధి వ్యాపారిపై నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎఫ్‌ఐఆర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు రద్దు చేశారు.. దీనిని కవర్‌ చేసుకోవడానికి అమిత్‌షా బుకాయింపులకు దిగారు. తొలి కేసు ఢిల్లీలో కాదని, గ్వాలియర్‌లో చోరీకి సంబంధించిన కేసు అని నమ్మబలికే యత్నం చేశారు. జూలై 1 అర్థరాత్రి నుంచి మోడీ ప్రభుత్వం అమల్లోకి మూడు క్రిమినల్‌ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక దేశ వ్యాపితంగా వీధి వ్యాపారులపై పలు కేసులు నమోదయ్యాయని ది వైర్‌ తెలిపింది.
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌ సమీపంలో బీహార్‌కు చెందిన వీధి వ్యాపారి పంకజ్‌ కుమార్‌ పె పోలీసులు కేసు నమోదు చేశారు. కమలా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదయిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం రోడ్డు పక్కన బండిపై పొగాకు, నీరు విక్రయిస్తున్నారని, బాటసారులకు ఇబ్బంది కలిగిస్తున్నాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. బిఎన్‌ఎస్‌ సెక్షన్‌ 285 (పబ్లిక్‌వే లేదా నావిగేషన్‌ లైన్‌లో ప్రమాదాలు, అడ్డంకులు సృష్టించడం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరం కనుక రుజువయితే రూ. 5 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. దీంతోబాటు భారతీయ నాగరిక సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌)లోని సెక్షన్‌ 173 కింద కూడా కేసు పెట్టారు. మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఆదివారం అర్ధ రాత్రి దాటిన తరువాత అంటే 12.16 గంటలకు కొత్త చట్టాల కింద ఒక కేసు నమోదయింది.. దీనికి 11 నిమిషాలకు ముందు జరిగిన ఘటనపై ప్రఫుల్‌ చౌహన్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. భోజనం తరువాత టీ తాగడానికి వెళితే అక్కడ టీ విక్రేత పాత వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని తనపై దుర్భాషలు ఆడారని ప్రఫుల్‌ చౌహన్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో కొత్త చట్టం భారత న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 296 కింద పోలీసులు నమోదు చేశారు. అర్ధరాత్రి అయిన కొన్ని నిమిషాల తరువాత తన యమహా ద్విచక్ర వాహనం దొంగతనానికి గురయిందని సౌరబ్‌ నర్వరియా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. గోవాలో కొబ్బరి కాయలు అమ్మే వీధి వ్యాపారిపై కొత్త చట్టం కింద కేసు నమోదయింది.

➡️