ఎయిమ్స్‌-ఢిల్లీలో తొలిసారిగా విజయవంతంగా రెండు కిడ్నీల మార్పిడి

Mar 17,2024 23:38 #dehi, #delhi aims, #Kidney, #transplant
  •  ప్రస్తుత గ్రహీతకు నాలుగు కిడ్నీలు

న్యూఢిల్లీ : ఎయిమ్స్‌ ఢిల్లీలో తొలిసారిగా రెండు కిడ్నీల మార్పిడి ఆపరేషన్‌ను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. గ్రహీత అయిన డయాలిస్‌తో బాధపడుతున్న 51 ఏళ్ల మహిళా రోగికి ఉన్న రెండు మూత్ర పిండాలను తొలగించకుండానే హెటెరోట్రోపిక్‌ పద్ధతిలో ఈ రెండు కిడ్నీలను అమర్చారు. దీంతో ప్రస్తుతం గ్రహీతకు నాలుగు కిడ్నీలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబరు 22న ఆర్గాన్‌ రీట్రవల్‌ బ్యాంకింగ్‌ ఆర్గనైజేషన్‌ (ఓఆర్‌బిఓ) సహకారంతో ఎయిమ్స్‌ ఢిల్లీ యొక్క సర్జికల్‌ విభాగాల విభాగం, నెఫ్రాలజీ విభాగం ద్వారా ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ వివరాలను శస్త్రచికిత్సలో పాల్గొన్న అడిషనల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అసూరి కృష్ణ శనివారం మీడియాకు వెల్లడించారు. శస్త్రచికిత్స విజయవంతంగా జరగడం, గ్రహీత బాగానే ఉన్నట్లు నిర్థారణ కావడంతో ఈ విషయాలను వెల్లడిస్తున్నట్లు చెప్పారు. దాత 78 ఏళ్ల మహిళ అని డాక్టర్‌ కృష్ణ తెలిపారు. కిందపడి తలకు బలమైన గాయం కావడంతో గత ఏడాది డిసెంబరు 19న ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌లో ఈ మహిళ చేరారని తెలిపారు. తరువాత బ్రెయిన్‌ డెడ్‌ అని వైద్యులు ప్రకటించడంతో అవయవ దానానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారని చెప్పారు. దాత 78 ఏళ్ల వయసు వారు కావడంతో గ్రహీతకు ఒక్క కిడ్నీ సరిపోయే అకాశం లేదని, అందుకే రెండు కీడ్నీలు అమర్చవలసి వచ్చిందని తెలిపారు. రెండు కిడ్నీలనూ కూడా గ్రహీతకు కుడివైపునే ఒకదానిపై ఒకటి వుంచినట్లు చెప్పారు. సాధారణంగా వృద్ధ దాతల నుంచి అవయవాలను తిరస్కరిస్తూ ఉంటారని, ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా దేశంలో అవయవాల భారీ డిమాండ్‌కు, తక్కువ సరఫరాకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఒక ప్రయత్నంగా డాక్టర్‌ అసూరి కృష్ణ వివరించారు.

➡️