రాష్ట్రంలో 46 రైల్వే స్టేషన్లకు శంకుస్థాపన

Feb 27,2024 11:15 #opened, #PM Modi, #railway station
  • దేశవ్యాపితంగా మరో 509 స్టేషన్లను కూడా
  • వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని

ప్రజాశక్తి – యంత్రాంగం : ఎన్నికల ముంగిట శంకుస్థాపనల మీద శంకుస్థాపనలతో బిజీబిజీగా ఉన్న మోడీ ప్రభుత్వం సోమవారం అమృత భారత్‌ రైల్వే స్కీమ్‌ను వర్చువల్‌గా ప్రారంభించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 46 స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే దేశవ్యాపితంగా మరో 509 స్టేషన్లకు కూడా ఆయన ఆన్‌లైన్‌ ద్వారా శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో రూఫ్‌ప్లాజా, షాపింగ్‌జోన్‌, ఫుడ్‌కోర్టు, పిల్లల ఆట ప్రదేశం మొదలైన సౌకర్యాలతో స్టేషన్లను నగర కేంద్రాలుగా తీర్చిదిద్దడం, ప్రవేశ, నిష్క్రమణలకు వేర్వేరు మార్గాలు, బహుళ అంతస్తుల పార్కింగ్‌, లిఫ్ట్‌, ఎస్కలేటర్‌, ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌., వెయిటింగ్‌ ఏరియా, ట్రావలేటర్‌, వికలాంగులకు సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.

విజయనగరంలోని బిసికాలనీ ప్రాంతంలోని మ్యాంగో యార్డు నుంచి రైల్వే ట్రాక్‌ దాటేందుకు వీలుగా రూ.48.98 కోట్లతో వంతెన పనులకు, కొత్తవలసలో రూ.18.77 కోట్లు, చీపురుపల్లిలో రూ.21 కోట్లతో, బొబ్బిలిలో రూ.16 కోట్లతో, పార్వతీపురం రూ.14.76 కోట్ల పనులకు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దూసి, ఊసవానిపేట, ప్లైఓవర్లు, నౌపడ, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఎంపి కింజరాపు రామ్మోహన్‌ మాట్లాడుతూ.. అమృత భారత్‌ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా కుర్ధా రైల్వే డివిజన్‌ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలోని మూడు రైల్వేస్టేషన్లలో అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు రైల్వే సేవలు మరింత చేరువయ్యేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో మినుమలమూడి, గొల్లపాలెం, దొరవారి సత్రంలలో ఏర్పాటు చేసిన బ్రిడ్జిల నిర్మాణాల వద్ద చెన్నై సదరన్‌ రైల్వే డివిజన్‌ డిఆర్‌ఎం సింగ్‌ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిత్తూరు అర్బన్‌లో రైల్వేస్టేషన్‌ ఆధునీకరణకు రూ.14 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని చిత్తూరు అభివృద్ధి వేదిక నాయకులు తెలిపారు.

ఎపిలో స్టేషన్లతో బాటు దేశవ్యాపితంగా మరో 509 స్టేషన్లకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ. తమ ప్రభుత్వం మూడో పదవీ కాలం జూన్‌లో ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టులకు మరిన్ని నిధులు ఖర్చు చేస్తామని చెప్పారు.భారతీయ రైల్వే మొత్తంగా పెద్ద ఎత్తున మార్పులకు గురవుతోందని, స్కూళ్లు, కాలేజీలకు వెళ్ళేవారికి, 35ఏళ్ళలోపు వారికి లబ్ది చేకూరేలా చర్యలు వుండబోతున్నాయన్నారు. ప్రభుత్వ జోక్యం మరింత పరిమితం చేస్తాం వ్యాపార వాణిజ్యంలో ప్రభుత్వ జోక్యం అత్యంత తక్కువగా వుండేలా చూస్తామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. . ప్రజల సంక్షేమానికి మాత్రమే ప్రభుత్వం పనిచేయాలి తప్ప ఇతర వ్యవహారాల్లో జోక్యం వుండరాదని, అటువంటి సమాజాన్ని నిర్మించడమే తమ లక్ష్యమన్నారు.

➡️