Encounter – మరో నలుగురు మావోయిస్టుల కాల్చివేత

– బస్తర్‌లో ఆగని ఎన్‌కౌంటర్లు
రాయ్ పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. బస్తర్‌ ప్రాంతంలో శుక్ర, శనివారాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మరికొందరు గాయాలతో తప్పించుకున్నారు. శనివారం ఉదయం బీజాపూర్‌ జిల్లా ఉసూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని డోలిగట్ట అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించగా, దంతెవాడలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సల్‌ చనిపోయినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. ఘటనా స్థలి నుండి ఒక తేలిక పాటి మెషిన్‌ గన్‌ను, ఎకె 47ను, మరికొన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజి సుందర్‌రాజ్‌ తెలిపారు. తాజా ఎదురుకాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులతో కలిపి ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 50కి చేరింది. వారం రోజుల వ్యవధిలోనే 23 మంది నక్సల్స్‌ను ఎన్‌కౌంటర్ల పేరుతో భద్రతా దళాలు చంపేశాయి. వీరిలో 33 మంది బీజాపూర్‌లో, ఆరుగురు దంతెవాడలో, ఐదుగురు కంకేర్‌లో, నలుగురు సుక్మాలో, ఇద్దరు నారాయణపూర్‌లో చనిపోయారు.

➡️