మైనింగ్‌ ప్రాంతానికి వెళ్లి ఇసుక తవ్వకాలు ఆపేయండి – సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు

May 10,2024 22:49 #orders, #supreem court

-క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నిర్దేశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ అక్రమంగా మైనింగ్‌ జరుగుతోందో ఆయా ప్రాంతాలకు ప్రత్యక్షంగా వెళ్లి అధికారులే ఇసుక తవ్వకాలను ఆపేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై పలువురు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సంబంధిత భాగస్వామ్య పార్టీలకు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఇదివరకే సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలపై జెపి వెంచర్స్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ అభరు ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌తో కూడిన ధర్మాసనం తక్షణమే అక్రమ శాండ్‌ మైనింగ్‌ను అడ్డుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే మైనింగ్‌ జరిగే ప్రదేశానికి వెళ్లి ఆపాలని నిర్దేశించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్‌ పై చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘మీ చర్యలన్ని కాగితాలపైనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కనిపించవు’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌జిటి తీర్పును యథాతధంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు ఉన్న చోట మ్యానువల్‌గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని పేర్కొంది.
పిటిషనర్‌ నాగేంద్ర కుమార్‌ అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించింది. పిటీషనర్‌ ఫిర్యాదులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఏపి ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ చట్టాల మేరకు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
అక్రమ మైనింగ్‌ను నిర్ధారించిన కేంద్రం
పర్యావరణ అనుమతులు లేకుండా ఏపిలో ఇంకా భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్రం నియమించిన కమిటీ నివేదికలో నిర్ధారించింది. ఫోటోలతో పాటు ఇతర సాక్ష్యాధారాలతో సహా నివేదికను ఎన్‌జిటికి అందజేసింది. కేంద్ర కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు ఎన్‌జిటి ఆదేశాలను జారీ చేసింది. యంత్రాలతో ఇసుక మైనింగ్‌ కు అనుమతులు లేనప్పటికీ భారీ యంత్రాలతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు నివేదికలో పేర్కొంది. గతంలో ఇసుక అక్రమాలపై జెపి ఫవర్‌ వెంచర్స్‌కు రూ.18 కోట్లు తాత్కాలికంగా జరిమానాను ఎన్‌జిటి విధిచింది. ఏపిలో కేవలం 40 రీచ్‌లలో మ్యానువల్‌ మైనింగ్‌కి అనుమతులుంటే, దాదాపు 500కు పైగా రీచ్‌లలో పర్యావరణ అనుమతులు లేకుండానే యంత్రాలతో ఇసుక మైనింగ్‌ చేస్తున్నట్లు కేంద్ర కమిటీ వెల్లడించింది. దీని ఆధారంగా ప్రకారం జెపి పవర్‌ వెంచర్‌ కంపెనీ రూ.500 కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌జిటి ఇదివరకే అభిప్రాయపడింది.

➡️