పత్రికా స్వేచ్ఛకు గ్రహణంశ్రీ కలాలకు సంకెళ్లు పడ్డాయి

May 7,2024 00:48 #journalists, #PM Modi
  •  గళాలు మూగబోయాయి
  •  మోడీ పాలనలో నిర్బంధాలు, అణచివేతలు

న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత్రికేయుల కలాలకు సంకెళ్లు పడ్డాయి. వారి గొంతుకలు అణచివేతకు గురై మూగబోయాయి. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను భరించలేక విదేశీ జర్నలిస్టులు దేశం విడిచి వెళ్లిపోయారు. మరికొందరు జైళ్లలో మగ్గుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ ఉదాశీన వైఖరిని ప్రశ్నించడమే వారు చేసిన నేరం. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పూర్తిగా కనుమరుగై పోయింది. బడా మీడియా సంస్థలు సైతం అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నాయి. వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. పాలకుల భజనలో మునిగితేలుతున్నాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కథనాన్ని రూపొందించినందుకు ఎన్‌డి టివిలో పనిచేసిన రవీష్‌ కుమార్‌ తన ఉద్యోగాన్నే వదులుకోవాల్సి వచ్చింది. దానికి కారణం ఎన్‌డి టివి యాజమాన్యం మారడం… నూతన యాజమాన్యం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం. దేశంలో పత్రికా స్వేచ్ఛకు ఏ విధంగా గ్రహణం పట్టిందో ఈ ఉదంతం చాటిచెబుతోంది. పత్రికా స్వేచ్ఛపై మొత్తం 180 దేశాల్లో సర్వే నిర్వహించగా మన దేశం 159వ స్థానంలో నిలిచింది.

విదేశీ పాత్రికేయులపై కక్ష సాధింపు
మోడీ ప్రభుత్వం ఇటీవలే ఇద్దరు విదేశీ పాత్రికేయులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. చివరికి వారు మూటా ముల్లే సర్దుకొని స్వదేశాలకు వెళ్లిపోయారు. ఫ్రాన్స్‌లోని అనేక మీడియా సంస్థలకు వార్తలు అందిస్తూ, మన దేశంలో సుదీర్ఘ కాలం పనిచేసిన వనెస్సా డగక్‌ ఫిబ్రవరిలో భారత్‌ను వీడారు. ఓవర్‌సీస్‌ సిటిజన్‌ ఇండియా కార్డును మోడీ ప్రభుత్వం రద్దు చేయడంతో చేసేదేమీ లేక ఆమె ఫ్రాన్స్‌ వెళ్లిపోయారు. ఏప్రిల్‌లో ఎబిసి న్యూస్‌కు చెందిన అవనీ డయాస్‌ కూడా ఆస్ట్రేలియాకు తిరుగుముఖం పట్టారు. ‘గీత దాటారంటూ’ ఆమెపై నిందలు వేసి వీసాను పొడిగించేందుకు నిరాకరించారు. ఎన్నికల వార్తల కవరేజీ కోసం భారత్‌ వెళ్లాల్సిన తన కరస్పాండెంటుకు మోడీ ప్రభుత్వం వీసా ఇవ్వలేదని అల్‌ జజీరా టివి తెలిపింది.
దేశంలో పనిచేస్తున్న విదేశీ పాత్రికేయులు ఈ ఉదంతాలపై రెండు కథనాలు అందించారు. అవి అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కన్పించాయి. హిందూత్వ వెబ్‌సైట్లు మాత్రం విదేశీ పాత్రికేయులను సాగనంపడాన్ని సమర్ధించాయి.

వ్యతిరేకిస్తే జైలే
ఇక స్వదేశీ పాత్రికేయుల ఇబ్బందులు చెప్పనలవి కావు. వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రస్తుతం ఎనిమిది మంది జర్నలిస్టులు జైళ్లలో ఉన్నారు. కాశ్మీర్‌కు చెందిన పాత్రికేయుడు అసిఫ్‌ సుల్తాన్‌ 2018 నుండీ జైలు జీవితం గడుపుతున్నారు. పంజాబ్‌కు చెందిన స్వతంత్ర పాత్రికేయుడు రాజీందర్‌ సింగ్‌ థగ్గర్‌ను గత వారం అరెస్ట్‌ చేశారు. గౌతమ్‌ నవ్‌లఖా 2020 నుండి గృహనిర్బంధంలోనే ఉన్నారు. కాశ్మీర్‌కు చెందిన సజాద్‌ గల్‌, జార్ఖండ్‌ రిపోర్టర్‌ రేపేష్‌ కుమార్‌ సింగ్‌ 2022 నుండి, కాశ్మీర్‌ పాత్రికేయులు ఇర్ఫాన్‌ మెV్‌ారాజ్‌, మజీద్‌ హైదరీలు 2023 నుండి జైలులోనే మగ్గుతున్నారు. న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ గత సంవత్సరం నుండి జైలులో ఉన్నారు. న్యూస్‌క్లిక్‌ ఉద్యోగుల కార్యాలయాలు, పని ప్రదేశాలపై కూడా దాడులు జరిగాయి. ప్రజల పక్షాన నిలిచి, నిజాలను నిర్భయంగా చెప్పే కలం వీరులకు వెన్నుపోటు పొడవడానికి పాలకపక్షం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ఈ ఉదంతాలు రుజువు చేస్తున్నాయి.

నిఘా నీడలో…
పైగా అరెస్టు చేసిన పాత్రికేయులపై మోపిన సెక్షన్లు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఉదాహరణకు ప్రబీర్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, ఆయనకు విదేశీ నిధులు అందుతున్నాయని తీవ్రమైన అభియోగాలు మోపారు. మసీదు కూల్చివేతపై వార్త రాసిన నేరానికి ఓ యువ పాత్రికేయుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దేశంలో పలువురు పాత్రికేయులు నిఘా నీడలో జీవించాల్సి వస్తోంది. వారిపై హిందూత్వ శక్తులు ఓ కన్నేసి ఉంచుతారు. అనుమానం కలిగితే చాలు… గద్దల్లా వాలిపోతారు. సామ దాన బేధ దండోపాయాలు ప్రయోగిస్తారు.

శభాష్‌…శాంత
‘ది వైర్‌’ పోర్టల్‌కు చెందిన సుకన్య శాంత భారతీయ కారాగారాల్లో కుల వివక్షపై ఓ కథనాన్ని అందించారు. దీనిని సుమోటోగా స్వీకరించిన రాజస్థాన్‌ హైకోర్టు జైళ్ల నిబంధనలను మార్చింది. అయినప్పటికీ పెద్దగా మార్పేమీ రాలేదు. దీనిపై హక్కుల సంఘం చర్యలు తీసుకుంటుందేమోనని శాంత మూడు సంవత్సరాలు ఎదురు చూశారు. ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఎవరూ పట్టించుకోనంత మాత్రాన వెనక్కి తగ్గాల్సిన అవసరమేముందని ఆమె ప్రశ్నించారు. అన్ని కథలూ సుఖాంతం కావు. మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ రిఫైనరీ ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని వార్త రాసినందుకు 48 సంవత్సరాల పాత్రికేయుడు శశికాంత్‌ వరిషే సంవత్సరం క్రితం హత్యకు గురయ్యారు.

➡️