ఇజ్రాయిల్‌ పట్ల పెరుగుతున్న ఆగ్రహావేశాలు

Apr 25,2024 00:02 #Gaza

సామూహిక సమాధులపై స్వతంత్ర దర్యాప్తుకు పెరుగుతున్న డిమాండ్‌

గాజా : గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరం నుండి ఇజ్రాయిల్‌ బలగాలు వైదొలగిన తర్వాత నెమ్మదిగా ప్రజలు అక్కడకు తిరిగి వెళుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌ ఆర్మీ పాల్పడిన దురాగతాలు, అకృత్యాల గురించి బయటి ప్రపంచానికి తెలుస్తోంది. నాసర్‌ ఆస్పత్రిలో మూకుమ్మడి సమాధులు బయల్పడటం, వాటిని తవ్వి వందలాది మృతదేహాలను ఇంకా వెలికితీస్తూనే వుండడంతో సైన్యం అరాచకాలపై స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టాలని అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. చేతులు వెనక్కి విరిచి కట్టేసి, కొంతమందికి బట్టలూడదీసి హింసించి చంపేసినట్లు ఆ మృతదేహాలను చూస్తే తెలుస్తోందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయ ప్రతినిధి రావినా షామ్‌దాసాని తెలిపారు. ఐక్యరాజ్య సమితి, యురోపియన్‌ యూనియన్‌ సహా పలు అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖులు ఈ ఊచకోతఘటనలపై దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు.
మరోపక్క ఉత్తర గాజాలోని బెయిట్‌ లాహియా నగరంపై ఇజ్రాయిల్‌ బలగాలు దాడి చేసి, పాలస్తీనియన్లను అక్కడ నుండి తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించడంతో అక్కడ గల వేలాదిమంది పౌరుల భద్రతపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. . ఉత్తర ఇజ్రాయిల్‌ నుండి రెండు బ్రిగేడ్ల సైన్యాన్ని గాజాలో నిర్దిష్టంగా పేరు వెల్లడించని ఒక ప్రాంతానికి తరలించడంతో దక్షిణ రఫా నగరంపై భూతల దాడులు రేపోమాపో జరగవచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రఫాపై గత కొన్ని రోజులుగా ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు జరుపుతూ భారీ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఉత్తర గాజా నుండి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం మొదలుపెట్టారు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లో 40 హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రకటించింది. వీటిలో ఆయుధ నిల్వల కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా వున్నాయని తెలిపింది. ఇప్పటివరకు గాజా యుద్ధంలో 34,262మంది మరణించగా, 77,229మంది గాయపడ్డారు. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో పాలస్తీనా గ్రామాలపై ఇజ్రాయిల్‌ సెటిలర్ల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఇటువంటి దాడుల్లో 482మంది పాలస్తీనియన్లు మరణించారు. గాజావ్యాప్తంగా తీవ్రంగా ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. హెపటైటిస్‌, మెనింజైటిస్‌ వ్యాధులు పెచ్చరిల్లుతున్నాయని తెలిపింది. పరిశుభ్రమైన తాగు నీరు కొరవడడంతో అనేక అంటువ్యాధులు చుట్టుముడుతున్నాయిని తెలిపింది.
నెతన్యాహు ప్రభుత్వంపై ఎర్డోగన్‌ ధ్వజం
మూకుమ్మడి ఊచకోతలను కప్పిపుచ్చడానికి ఇజ్రాయిల్‌ చేసే యత్నాలను అస్సలు సహించరాదని టర్కీ అధ్యక్షుడు రెసిప్‌ తైయీప్‌ ఎర్డోగన్‌ వ్యాఖ్యానించారు. తన పదవిని కాపాడుకోవడం కోసం ఇజ్రాయిల్‌ ప్రజలను, ఆ ప్రాంతాన్ని పణంగా పెడుతున్నారని టర్కీ నేత అన్నారు. పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌పై చర్య తీసుకోవాలని ఇరాన్‌, పాకిస్తాన్‌ భద్రతా మండలిని కోరాయి.

➡️