గుజరాత్‌ టు చెన్నై ముఠా గోల్డ్‌ దందా

May 26,2024 22:50 #Gold
  • సిండికేట్‌ సభ్యుల అరెస్టు
  •  10.5 కిలోల పసిడి స్వాధీనం

అహ్మదాబాద్‌ : బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్నంటుతోంది. సామాన్యుడు కనీసం కొనాలనే ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. అక్రమార్కులు మాత్రం విదేశాల నుంచి కిలోల కొద్దీ బంగారాన్ని దేశానికి తీసుకువస్తున్నారు. ఎన్ని నిఘాలు పెట్టినా వీరికి అడ్డుకట్ట వేయడం కష్టంగా మారుతోంది. దీనికి మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ వేదికగా మారింది. ఇక్కడి నుంచి మొన్నటి వరకు డ్రగ్స్‌ అక్రమ రవాణా జరిగేది. ఇప్పుడు బంగారం కూడా ఆ లెక్కలో చేరింది.
అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10.32 కిలోల బంగారం పట్టుబడింది. కీలక సమాచారం అందుకున్న రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ (డిఆర్‌ఐ) అధికారులు ప్రయాణీకులను తనిఖీ చేశారు. పట్టుబడ్డ వారి నుంచి మరింత సమాచారం రాబట్టి వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడంతో రూ. 7.75 కోట్లు విలువైన 24 క్యారెట్ల బంగారం పట్టుబడింది.
నిఘా వర్గాల సమాచారం ఆధారంగా, డీఆర్‌ఐ అధికారులు అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభారు పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (ఎస్‌పిఐ) లో పట్టుకున్నారు. వారు లోదుస్తుల్లో దాచిపెట్టిన 3596.36 గ్రాముల బంగారం పేస్టును స్వాధీనం చేసుకున్నారు. వారిని రిసీవ్‌ చేసుకోవడానికి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులును సైతం అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే సిండికేట్‌కు సంబంధించి గుట్టు రట్టయింది. ఈ సిండికేట్‌కు సంబంధించిన ఇతర సభ్యులు విమానాశ్రయానికి దగ్గర్లో బస చేసిన హోటల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ లోపే ఉదయం వచ్చిన మరో సిండికేట్‌ సభ్యుడు అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని.. అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి రైలులో తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అతన్ని కూడా బోరివలి స్టేషన్‌ వద్ద పట్టుకుని 2,551 గ్రాముల బంగారం పేస్టును స్వాధీనం చేసుకున్నారు. అదే సిండికేట్‌కు చెందిన మరో వ్యక్తి దుబారు నుంచి వస్తున్నట్టు తెలియడంతో అతన్ని కూడా పట్టుకుని 5.5 కిలోల బంగారం పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం బంగారాన్ని అహ్మదాబాద్‌లో ఉన్న తమ గ్రూపు సభ్యుడికి అందజేయాల్సి ఉందని సమాచారం. మొత్తం ఈ అక్రమ రవాణాలో పాల్గొన్న కీలక వ్యక్తితో సహా పది మందిని కస్టమ్స్‌ చట్టం కింద డీఆర్‌ఐ అరెస్టు చేసింది. వీరంతా తమిళనాడుకు చెందిన వేర్వేరు వ్యక్తుల ద్వారా విదేశాల నుంచి బంగారం పేస్టును అక్రమంగా రవాణా చేశారు. నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఈ సిండికేట్‌లో ఒక వ్యక్తి విదేశాల నుంచి తీసుకువచ్చిన బంగారాన్ని ముంబై, చెన్నైతో పలు ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్టు డీఆర్‌ఐ విచారణలో వెల్లడైంది.

➡️