తొలి సార్వత్రికం సాగిందిలా..

Apr 21,2024 03:43

1952 నుంచి ఇప్పటివరకూ ఐదుసార్లు విభిన్న కారణాలతో మధ్యంతర ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే, ప్రతి లోక్‌సభ తన ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసి ఉంటే 15వ లోక్‌సభ ఎన్నికలు 2021లో జరిగేవి. కాగా స్వతంత్ర భారతంలో 1952 మొదటి లోక్‌సభ ఎన్నికలు ఎంతో ఆసక్తికరం. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరించడం ద్వారా ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద పోలింగ్‌ దేశమైంది.
అక్టోబర్‌ 25, 1951న మొదటి ఓటు ప్రస్తుత హిమచల్‌ ప్రదేశ్‌లోని ‘చీని’ ప్రాంతంలో పడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 364 సీట్లను గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టింది. భారత కమ్యూనిస్టు పార్టీ 16 సీట్లు గెలిచి, రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆచార్య నరేంద్ర యాదవ్‌, జయప్రకాష్‌ డాక్టర్‌ లోహియా నేతృత్వంలోని సోషలిస్టు పార్టీకీ 12, ఆచార్య జె.బి కృపాలనీ నేతృత్వంలోని కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ 9, హిందూ మహాసభకి 4, డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ నేతృత్వంలో భారతీయ జనసంఫ్‌ుక 3, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ 3, షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫెడరేషన్‌కు రెండు సీట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సుమారు 4కోట్ల 76లక్షల 65వేల 951 (44.99 శాతం) ఓట్లు సాధించింది. భారత కమ్యూనిస్టు పార్టీ 34లక్షల 84వేల 401 (3.29 శాతం) ఓట్లు సాధించింది.ఆ సమయంలో నియోజకవర్గాల్లో ఒకటికంటే ఎక్కువ సీట్లు (ద్విసభ్య నియోజకవర్గాలు) ఉండేవి. కాబట్టి 489 స్థానాల కోసం 401 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ద్విసభ్య విధానాన్ని 1960లో ఆపేశారు.

నాలుగు నెలల ప్రహసనం
మొదటి సాధారణ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 489 లోక్‌సభ స్థానాలు, రాష్ట్రాల శాసనసభలకు సంబంధించి 3,283 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దేశ వ్యాప్తంగా 17కోట్ల 32 లక్షల 12 వేల 343 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో 10కోట్ల 59 లక్షల మంది, అంటే సుమారు 85 శాతం మంది నిరక్షరాస్యులు. వారి విలువైన ఓటుతో ప్రజా ప్రతినిధులను ఎన్నుకొని ప్రపంచాన్ని ఆశ్చర్య పడేలా చేశారు. 25 అక్టోబర్‌ 1951 నుంచి 21 ఫిబ్రవరి 1952 వరకూ సుమారు నాలుగునెలలపాటు జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియలో భారతదేశం ఓ కొత్త శకంలోకి అడుగుపెట్టింది.

తొలి సిఇసి సుకుమార్‌ సేన్‌
భారత తొలి ఎన్నికలకు సుకుమార్‌ సేన్‌ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఓటర్లు ఓటు నమోదు చేసుకునే ప్రక్రియ నుంచి రాజకీయ నాయకుల ఎన్నికల గుర్తులను, పోలింగ్‌ కేంద్రాలు పరిశుభ్రంగా ఉంచే పని, అర్హత కలిగిన అధికారులను ఎంపిక చేసే ప్రక్రియ ఇవన్నీ ఆయనే స్వయంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా చేశారు.

అభ్యర్థికో బాక్స్‌
అప్పట్లో లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు పూర్తిచేయాలంటే అంత సులవైన పనేమీ కాదు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను నమోదు చేసుకోవడం, మెజారిటీ ఓటర్ల నిరక్షరాస్యతను దృష్టిలో ఉంచుకుని పార్టీలు, అభ్యర్థులు ఎన్నికలగుర్తులను ఎంపిక చేసేవారు. అప్పట్లో బ్యాలెట్‌కాగితాలపై పేరు, గుర్తులు ఉండేవి కాదు. ప్రతి పార్టీకి ఒక బ్యాలెట్‌ బాక్సు ఉండేది. వాటిపై ఎన్నికల గుర్తును ప్రచురించేవారు. వీటికోసం ఐరన్‌తో చేసిన రెండు కోట్ల 12 లక్షల బ్యాలెట్‌ బాక్సులను ఏర్పాటు చేశారు. సుమారు 62 కోట్ల బ్యాలెట్లు ముద్రించబడ్డాయి. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్లు సంబంధిత పోలీంగ్‌ ప్రాంతాలకు చేర్చడమంటే అప్పట్లో బాగా సమస్యాత్మకంగా ఉండేది. రవాణా మార్గాలు ఇప్పటిలా లేవు. ఇలాంటి పరిస్థితిలో కొండలు, అడవులు, మైదాన ప్రాంతాలను నదులు దాటుకుని సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేవారు. చాలామంది అనారోగ్యాల బారిన పడడం, కొంతమంది చనిపోవడం, మరికొందరు తప్పిపోవడం వంటివి కూడా జరిగాయి. ఈశాన్య మయన్మార్‌ (బర్మా) సరిహద్దు ప్రాంతం నుంచి మణిపూర్‌లోని పర్వత ప్రాంతాల్లోని స్థానిక ప్రజలతో అక్కడి అధికారులు కొన్ని ఒప్పందాలను కుదుర్చుకునేవారు. అదేంటంటే, ఓటింగ్‌ మెటీరియల్‌ను పోలింగ్‌ ప్రాంతాలకు సురక్షితంగా చేరిస్తే, వారికి బదులుగా ఒక దుప్పటి, లైసెన్స్‌ గన్‌ ఇస్తామని చెప్పడమే. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఒప్పందాలు చేసుకునేవారు.

మొదటి ఎన్నిక
లోకసభ స్థానాలు 489
ఓటర్లు 17,32,12,343
నిరక్షరాస్యులు 10,59,00,000
సమయం 4 మాసాలు
బ్యాలెట్‌ పెట్టెలు 12 లక్షలు
బ్యాలెట్‌ పత్రాలు 62 కోట్లు

➡️