కేరళ పాఠశాలలో తొలి రోబో టీచర్‌ !

  •  మూడు భాషల్లో ముచ్చటించే సామర్థ్యం

త్రివేండ్రం : తొలి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టీచర్‌ ఐరిస్‌ త్రివేండ్రంలోని కేటీసీటీ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో విద్యా బోధన ప్రారంభించింది. ఈ రోబోను మేకర్‌ల్యాబ్స్‌ ఎడ్యుటెక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసింది. దేశంలో ఏఐ పరిజ్ఞానానికి ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో కేరళలోని ఈ పాఠశాల దాని ప్రయోజనాలను అందిపుచ్చుకొని చరిత్ర సృష్టించింది. ఏఐ టీచర్‌ ఐరిస్‌ విద్యార్థులతో కనీసం మూడు భాషల్లో ముచ్చటించగలదు. క్లిష్టతరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు. గాత్ర సహకారం అందించగలదు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యను అభ్యసించడంలో విద్యార్థులను భాగస్వాములను చేయగలదు. తోటి వారి సాయం అవసరం లేకుండానే విద్యార్థులు నైపుణ్యాన్ని సంపాదించేలా వారి సామర్ధ్యాన్ని పెంచగలదు. వారు స్వేచ్ఛగా, సులభంగా విద్యను అభ్యసించేలా చేయగలదు. ఐరిస్‌ టీచర్‌ వీడియోను మేకర్‌ల్యాబ్స్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ హాండిల్‌లో షేర్‌ చేసింది. ఆ వీడియో ఇప్పటికే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ‘ప్రతి విద్యార్థి అవసరాలు, ప్రాధాన్యతలను ఐరిస్‌ గుర్తిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమర్ధవంతంగా పాఠాలు బోధించేలా విద్యావంతులను తీర్చిదిద్దుతుంది’ అని మేకర్‌ల్యాబ్స్‌ ఆ పోస్ట్‌లో తెలిపింది.

➡️